ఆయన ఏనాడూ డబ్బు కోసం ఆశపడలేదు: సీఎం చంద్రబాబు

  • అధికార భాష సంఘానికి మండలి వెంకట కృష్ణారావు పేరు పెడతామన్న చంద్రబాబు
  • తెలుగు భాష పరిరక్షణ కోసం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ నివాళులు  
  • తండ్రి బాటలోనే బుద్దప్రసాద్ భాషాభ్యున్నతికి పాటుపడుతున్నారన్న చంద్రబాబు
మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు డబ్బు కోసం ఎప్పుడూ ఆశపడలేదని, స్వాతంత్ర్య సమరయోధుల కోటాలో ప్రభుత్వం కేటాయించిన ఐదు ఎకరాలను కూడా పేదలకు ఇచ్చేశారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. నిన్న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన మండలి వెంకట కృష్ణారావు శతజయంతి వేడుకల్లో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మండలి వెంకట కృష్ణారావు వ్యక్తిత్వాన్ని ఆయన కొనియాడారు.

"నేను ఈ కార్యక్రమానికి రావడానికి ఒక ముఖ్య కారణం ఉంది. నేటి తరానికి విలువలతో కూడిన రాజకీయాలు ఎలా ఉంటాయో తెలియాలి. 1978-1983 మధ్య కాలంలో మండలి వెంకట కృష్ణారావుతో ఎమ్మెల్యేగా కలిసి పనిచేసే అవకాశం నాకు వచ్చింది. విలువలతో కూడిన రాజకీయాలు, సేవాభావంతో పనిచేసిన నాయకత్వాన్ని ఒకప్పుడు చూశాం. ఇప్పుడు పూర్తిగా విలువలు పడిపోయాయి. అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే ధ్యేయంగా ఉంటున్నారు. గాంధీజీ ఆశయాలను తు.చ తప్పకుండా పాటించిన మండలి వెంకట కృష్ణారావు మహాత్మునికి నిజమైన వారసుడు" అని ముఖ్యమంత్రి చంద్రబాబు కొనియాడారు.

తెలుగు భాష కోసం అహర్నిశలు కృషి చేసిన మండలి వెంకట కృష్ణారావు పేరును అధికార భాషా సంఘానికి పెడతామని ఈ సందర్భంగా చంద్రబాబు ప్రకటించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయే వ్యక్తి మండలి వెంకట కృష్ణారావు అని అన్నారు. దివిసీమ ఉప్పెన సమయంలో ఆయన చేసిన సేవలు మరచిపోలేనివని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్‌కు తండ్రి వెంకట కృష్ణారావు లక్షణాలే వచ్చాయని చంద్రబాబు అన్నారు. తండ్రి పాటించిన విధంగా నీతి, నిజాయితీ, కొన్ని విలువలతో బుద్ద ప్రసాద్ ముందుకెళుతున్నారని కొనియాడారు. వెంకట కృష్ణారావు తరహాలోనే తెలుగు భాష అంటే ఆయనకు ఎంతో అభిమానమని, మాతృభాషను కాపాడేందుకు ఆయన బాటలోనే పయనిస్తున్నారని అన్నారు. 


More Telugu News