సిరాజ్ మియా... ఏం స్పెల్ వేశావు!: రాజమౌళి

  • ఇంగ్లండ్ పై టీమిండియా సంచలన విజయం
  • 6 పరుగుల తేడాతో నెగ్గి సిరీస్ సమయం చేసిన గిల్ సేన
  • ప్రశంసల వర్షం కురిపించిన రాజమౌళి
ఇంగ్లండ్‌తో జరిగిన ఉత్కంఠభరిత చివరి టెస్టులో టీమిండియా సంచలన విజయం సాధించడంపై అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి హర్షం వ్యక్తం చేశారు. భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై ఆయన ప్రశంసల వర్షం కురిపించారు. టెస్ట్ క్రికెట్ ఫార్మాట్‌కు ఏదీ సాటిరాదని అభిప్రాయపడ్డారు.

ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా ఓవల్ వేదికగా జరిగిన ఐదో టెస్టులో టీమిండియా అద్భుత పోరాట పటిమ కనబరిచింది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం 6 పరుగుల స్వల్ప తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-2తో సమం చేసింది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్‌లో మహమ్మద్ సిరాజ్ 5 వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్ పతనాన్ని శాసించాడు.

ఈ అద్భుత ప్రదర్శనపై స్పందించిన రాజమౌళి, ఎక్స్ వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. "సిరాజ్ మియా... వాట్ ఏ స్పెల్!!! ప్రసిద్ధ్ డబుల్ బ్లో!!! ఓవల్‌లో భారత్ తిరిగి పుంజుకుంది!!! టెస్ట్ క్రికెట్... దీనికి ఏదీ సాటి రాదు" అంటూ ఆయన ట్వీట్ చేశారు. సిరాజ్‌తో పాటు మరో పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ ప్రదర్శనను కూడా ఆయన కొనియాడారు.

సిరాజ్ నిప్పులు చెరిగే బంతులతో చెలరేగి, కీలక సమయంలో వికెట్లు తీసి జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. దీంతో క్రీడా ప్రముఖులతో పాటు సినీ ప్రముఖులు కూడా సిరాజ్‌ను, భారత జట్టును అభినందనలతో ముంచెత్తుతున్నారు.


More Telugu News