సిరాజ్ నిజమైన యోధుడు.. చాలా మంచోడు: జో రూట్

  • టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్‌పై జో రూట్ ప్రశంసలు
  • సిరాజ్ పోరాటపటిమ అమోఘం అని కితాబు
  • సిరాజ్‌ది 'దొంగ కోపం' అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు
  • ఈ సిరీస్‌లో 20 వికెట్లతో టాప్ వికెట్‌ టేక‌ర్‌గా భార‌త బౌల‌ర్  
భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్‌పై ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్ ప్రశంసల వర్షం కురిపించాడు. సిరాజ్‌ను నిజమైన యోధుడ‌ని అభివర్ణించిన రూట్, టీమిండియా కోసం అతను సర్వస్వం ఒడ్డి పోరాడతాడని కొనియాడాడు. ఓవల్ వేదికగా జరుగుతున్న ఐదో టెస్టులో నాలుగో రోజు ఆట ముగిసిన అనంతరం రూట్ ఈ వ్యాఖ్యలు చేశాడు.

ఈ మ్యాచ్‌లో సిరాజ్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో 86 పరుగులిచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ఇంగ్లండ్‌ను 247 పరుగులకే కట్టడి చేయడంలో ముఖ్యపాత్ర పోషించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లోనూ ఏమాత్రం అలసట లేకుండా సుదీర్ఘంగా 26 ఓవర్లు బౌలింగ్ చేసి రెండు వికెట్లు తీశాడు. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 20 వికెట్లతో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా సిరాజ్ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

సిరాజ్ గురించి రూట్ మాట్లాడుతూ, "అతను ఒక యోధుడు. జట్టులో అలాంటి ఆటగాడు ఉండాలని ఎవరైనా కోరుకుంటారు. టీమిండియా కోసం తన పూర్తి సామర్థ్యాన్ని పెడతాడు. అతని నైపుణ్యం అమోఘం. అందుకే అన్ని వికెట్లు తీయగలుగుతున్నాడు. ఈ సిరీస్‌లో అత్య‌ధిక‌ వికెట్లు తీసిన బౌల‌ర్‌గా టాప్‌లో ఉన్నాడు" అని తెలిపాడు.

అదే సమయంలో సిరాజ్ దూకుడుపై రూట్ సరదాగా వ్యాఖ్యానించాడు. "మైదానంలో కొన్నిసార్లు అతను దొంగ కోపాన్ని ప్రదర్శిస్తాడు. కానీ అది పైకి మాత్రమేనని నేను గ్రహించగలను. నిజానికి అతను చాలా మంచి వ్యక్తి. కాకపోతే మైదానంలో దూకుడుగా ఉంటాడు" అని నవ్వుతూ పేర్కొన్నాడు. ఇక‌, రెండో ఇన్నింగ్స్‌లో హ్యారీ బ్రూక్ ఇచ్చిన క్యాచ్‌ను సిరాజ్ జారవిడిచినప్పటికీ, మ్యాచ్‌లో అతను చూపిన అలుపెరుగని పోరాటం అందరినీ ఆకట్టుకుందనే చెప్పాలి.


More Telugu News