కశ్మీర్‌లో భద్రతా బలగాల విజయం.. ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం

  • కశ్మీర్‌లోని కుల్గాంలో మూడో రోజూ కొనసాగుతున్న ఆపరేషన్ అఖల్
  • నేడు జరిగిన ఎన్‌కౌంటర్‌లో మరో ముగ్గురు టెర్రరిస్టులు హతం
  • మొత్తం మృతుల సంఖ్య ఆరుకు చేరినట్టు సైన్యం వెల్లడి
  • కాల్పుల్లో ఒక సైనికుడికి గాయాలు, కొనసాగుతున్న ఆపరేషన్
ఉగ్రవాదుల ఏరివేత లక్ష్యంగా జమ్మూకశ్మీర్‌ భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ అఖల్’ మూడో రోజూ కొనసాగుతోంది. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా అఖల్ అటవీ ప్రాంతంలో నేడు జరిగిన భీకర కాల్పుల్లో మరో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు. దీంతో ఈ ఆపరేషన్‌లో మరణించిన మొత్తం ఉగ్రవాదుల సంఖ్య ఆరుకు చేరింది. ఈ ఘటనలో ఒక సైనికుడు కూడా గాయపడినట్టు అధికారులు వెల్లడించారు.

నిఘా వర్గాల నుంచి అందిన పక్కా సమాచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు, సైన్యం, సీఆర్‌పీఎఫ్ బలగాలు సంయుక్తంగా శుక్రవారం అఖల్ అటవీ ప్రాంతంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించాయి. బలగాలను గమనించిన ఉగ్రవాదులు అడవిలో నక్కి కాల్పులకు తెగబడటంతో ఇది ఎన్‌కౌంటర్‌గా మారింది. నిన్న జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ఉగ్రవాదులను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. రాత్రంతా కాల్పుల మోతతో దద్దరిల్లిన ఈ ప్రాంతంలో నేడు మరో ముగ్గురిని హతమార్చాయి.

నిన్న హతమైన ఉగ్రవాదులు నిషేధిత లష్కరే తోయిబా (ఎల్‌ఈటీ) అనుబంధ సంస్థ అయిన ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ (టీఆర్‌ఎఫ్)కు చెందినవారని అధికారులు గుర్తించారు. 26 మంది పౌరుల మృతికి కారణమైన పహల్గాం ఉగ్రదాడికి ఈ సంస్థే బాధ్యత వహించింది. ఈ నేపథ్యంలో భద్రతా బలగాలు ఈ ఆపరేషన్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. అత్యాధునిక నిఘా వ్యవస్థలను, అత్యంత నైపుణ్యం కలిగిన బలగాలను రంగంలోకి దించాయి. 


More Telugu News