Amarnath Yatra: వారం ముందే ముగిసిన అమర్‌నాథ్ యాత్ర.. భారీ వర్షాల కారణంగా కీలక నిర్ణయం

Amarnath Yatra suspended from today a week before scheduled end
  • భారీ వర్షాలతో యాత్రా మార్గాలు తీవ్రంగా ధ్వంసం
  • యాత్రికుల భద్రత దృష్ట్యా అధికారుల కీలక నిర్ణయం
  • బల్తాల్, పహల్గామ్ రెండు మార్గాల్లోనూ నిలిచిన రాకపోకలు
  • ఈ ఏడాది 4.10 లక్షల మందికి పైగా పూర్తి చేసుకున్న యాత్ర
  • మరమ్మతు పనుల కారణంగా యాత్ర పునరుద్ధరణ అసాధ్యమని వెల్లడి
ప్రతి ఏటా అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగే అమర్‌నాథ్ యాత్ర ఈ ఏడాది అనుకున్న దానికంటే ముందుగానే ముగిసింది. ప్రతికూల వాతావరణం, భారీ వర్షాల కారణంగా యాత్రా మార్గాలు తీవ్రంగా దెబ్బతినడంతో, యాత్రికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని యాత్రను నిలిపివేస్తున్నట్లు జమ్మూకశ్మీర్ అధికార యంత్రాంగం ప్రకటించింది. షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 9న రక్షాబంధన్ రోజున ముగియాల్సిన యాత్రను, ఆగస్టు 3 నుంచే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.

గత వారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల వల్ల అమర్‌నాథ్ పుణ్యక్షేత్రానికి వెళ్లే బల్తాల్, పహల్గామ్ రెండు ప్రధాన మార్గాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీంతో ఈ మార్గాల్లో ప్రయాణం సురక్షితం కాదని అధికారులు నిర్ధారించారు. ఈ విషయంపై కశ్మీర్ డివిజనల్ కమిషనర్ విజయ్ కుమార్ బిధురి మాట్లాడుతూ, "భారీ వర్షాల వల్ల రెండు మార్గాల్లోనూ మరమ్మతులు చేయాల్సిన అవసరం ఏర్పడింది. ప్రస్తుతం మరమ్మతు పనులు చురుగ్గా జరుగుతున్నందున యాత్రను కొనసాగించడం సాధ్యం కాదు. అందుకే యాత్రను నిలిపివేయాలని నిర్ణయించాం" అని తెలిపారు.

ఈ ఏడాది జులై 3న ప్రారంభమైన ఈ యాత్రలో ఇప్పటివరకు 4.10 లక్షల మందికి పైగా భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. కాగా, గతేడాది 5.10 లక్షల మంది భక్తులు యాత్ర‌లో పాల్గొన్నారు.  

ఈ ఏడాది యాత్ర ప్రారంభానికి ముందు ఏప్రిల్‌లో పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగిన నేపథ్యంలో ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. యాత్రా మార్గాల పొడవునా అదనపు బలగాలను మోహరించి, భక్తులకు పూర్తి భద్రత కల్పించింది. 

అయితే, ప్రకృతి వైపరీత్యం కారణంగా యాత్రను ముందుగానే ముగించక తప్పలేదని అధికారులు వెల్లడించారు. మార్గాలకు మరమ్మతులు పూర్తిచేసి, అవి సురక్షితమని నిర్ధారించుకున్న తర్వాతే భవిష్యత్తులో యాత్రను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు.
Amarnath Yatra
Amarnath
Yatra
Jammu Kashmir
Heavy Rains
Pilgrimage
Baltal
Pahalgam
Vijay Kumar Bidhuri
Raksha Bandhan

More Telugu News