Goa Tourism: గోవా పర్యాటక ప్రదేశాల్లో న్యూసెన్స్ చేస్తే జరిమానా ఎంతో తెలుసా..? వామ్మో అనాల్సిందే..!

Goa Tourism Nuisance Fines Increased Know the Details
  • గోవా టూరిస్టు ప్లేసెస్ సవరణ బిల్లు 2025ను ఆమోదించిన ప్రభుత్వం 
  • పర్యాటకులకు ఇబ్బందులు కల్గిస్తే రూ.5వేల నుంచి రూ.లక్ష వరకూ జరిమానా 
  • పర్యాటకుల రక్షణ, శాంతి భద్రతల కోణంలో ఈ చర్యలు ఎంతో అవసరమన్న గోవా మంత్రి  
దేశంలో అత్యంత ప్రఖ్యాత పర్యాటక కేంద్రాల్లో గోవా ఒకటి. గోవాలోని అందమైన బీచ్‌లు, రాత్రి జీవన శైలి, సాంస్కృతిక వైవిధ్యం పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తాయి. అయితే గత కొన్ని రోజులుగా పర్యాటక ప్రదేశాల్లో దోపిడీ ఘటనలు ఎక్కువయ్యాయి. ఈ క్రమంలో గోవా పర్యాటక ప్రదేశాల్లో ఇబ్బందులు కలిగించే వారితో పాటు అనధికార కార్యకలాపాలకు పాల్పడే వారిపై ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.

ఇందుకు సంబంధించి గోవా టూరిస్ట్ ప్లేసెస్ (ప్రొటెక్షన్ అండ్ మెయింటనెన్స్) సవరణ బిల్లు 2024ను ప్రభుత్వం ఆమోదించింది. న్యూసెన్స్ అనే పదానికి విస్తృత నిర్వచనం ఇవ్వడంతో పాటు రూ.లక్ష వరకు జరిమానా విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది.

అనధికార బోట్లను లేదా కాలుష్యానికి, ప్రమాదాలకు కారణమయ్యే తేలియాడే వస్తువులను ఆపరేట్ చేయడం, వస్తువులను కొనాలని పర్యాటకులను ఇబ్బంది పెట్టడం, అనధికార ప్రదేశాల్లో మద్యం సేవించడం లేదా గ్లాసులను పగలగొట్టడం, బహిరంగ ప్రదేశాల్లో వంట చేసుకోవడం, చెత్త వేయడం, వాటర్ స్పోర్ట్స్ నిర్వహించడం, లేదా అనధికారికంగా టికెట్లు, వస్తువులు అమ్మడం, భిక్షాటన చేయడం, బీచ్‌లలో వాహనాలను ఆపరేట్ చేయడం, అనుమతి లేకుండా రాష్ట్రం వెలుపల ఉన్న ప్రదేశాలకు పర్యాటక సేవలు అందించడం వంటి వాటిని న్యూసెన్స్ నిర్వచనంలో చేర్చారు. పర్యాటకుల స్వేచ్ఛకు ఇబ్బంది కలిగించడాన్ని ఈ కొత్త చట్టంలో నేరంగా పరిగణించారు.

సవరించిన సెక్షన్ 10 ప్రకారం నిబంధనలు ఉల్లంఘిస్తే కనిష్ఠంగా రూ.5 వేల నుంచి రూ.లక్ష వరకు జరిమానా విధించనున్నారు. అంతే కాకుండా ఈ జరిమానాలను ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు సమీక్షించే విధంగా చట్టంలో నిబంధనలు రూపొందించారు. సంబంధిత అధికారుల సిఫార్సుల మేరకు ప్రతి రెండేళ్లకు ఒకసారి వీటిని పది శాతం పెంచే అవకాశం కూడా కల్పించారు.

దీనిపై గోవా పర్యాటక శాఖ మంత్రి రోహన్ ఖౌంటే స్పందిస్తూ పర్యాటకుల రక్షణ, శాంతి భద్రతల కోణంలో ఈ చర్యలు ఎంతో అవసరమని అన్నారు. పర్యాటక ప్రదేశాల్లో ఎక్కడ చూసినా ఏజెంట్లేనని అన్నారు. అనధికార ప్రచార కార్యక్రమాలను అరికట్టడంలో ఈ బిల్లు ఓ ముందడుగు అని అభిప్రాయపడ్డారు. పర్యాటకులను ఇబ్బంది కలిగించే సంఘటనలు పెరుగుతుండటం, పర్యావరణానికి హాని కలిగించే ఉల్లంఘనలు జరుగుతున్నాయని అన్నారు. ఈ క్రమంలో పర్యాటకులు, స్థానికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చర్యలు తీసుకున్నామని మంత్రి తెలిపారు. 
Goa Tourism
Goa
Goa beaches
Tourist places
Tourism
Goa tourism law
Rohan Khaunte
Goa nuisance law
Goa fines
Goa travel

More Telugu News