Chevireddy Bhaskar Reddy: మద్యం కేసులో కీలక మలుపు.. నోట్ల కట్టలు లెక్కిస్తున్న వీడియో సిట్ చేతికి!

Chevireddy Shock Key Evidence Collected in AP Liquor Scam Case
  • లిక్కర్ స్కామ్ నిందితుడు వెంకటేశ్ నాయుడు వాట్పాప్ నుంచి కీలక ఆధారం
  • డెన్‌లో నోట్ల కట్టలతో వెంకటేశ్ నాయుడు వీడియో లభ్యం 
  • వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కరరెడ్డి ప్రధాన అనుచరుడు వెంకటేశ్ నాయుడు
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరో కీలక పురోగతి సాధించింది. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ముఖ్య అనుచరుడుగా భావిస్తున్న వెంకటేశ్ నాయుడు, కోట్ల రూపాయల నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో ఒకటి సిట్ అధికారుల చేతికి చిక్కింది. ఎన్నికల ముందు పంపిణీ చేసేందుకు సిద్ధం చేసిన ఈ డబ్బు మద్యం కుంభకోణానికి సంబంధించిన ముడుపులేనని సిట్ బలంగా అనుమానిస్తోంది.

సిట్‌కు లభించిన ఈ వీడియోలో, వెంకటేశ్ నాయుడు భారీ మొత్తంలో నగదును లెక్కిస్తూ, వాటిని బాక్సులలో సర్దుతున్న దృశ్యాలు స్పష్టంగా ఉన్నాయి. ఈ డబ్బును రహస్య ప్రదేశాలకు తరలించి, అక్కడి నుంచి పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలను సేకరిస్తున్న సిట్‌కు ఈ వీడియో ఒక బలమైన సాక్ష్యంగా లభించిందని అధికారులు పేర్కొంటున్నారు.

ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి హైదరాబాద్‌లోని ఓ రహస్య స్థావరంలో సిట్ అధికారులు రూ.11 కోట్లను స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘటన జరిగిన కొద్ది రోజులకే ఈ వీడియో బయటపడటం ప్రాధాన్యత సంతరించుకుంది. రాష్ట్రంలో దాదాపు రూ.3,500 కోట్ల మేర మద్యం కుంభకోణం జరిగిందని సిట్ ప్రాథమికంగా అంచనా వేసి, ఇప్పటికే కోర్టుకు నివేదిక సమర్పించింది.

ఈ వీడియో ఆధారంతో కేసు దర్యాప్తును సిట్ మరింత వేగవంతం చేసింది. మరిన్ని రహస్య స్థావరాలు, డబ్బు నిల్వలపై అధికారులు దృష్టి సారించినట్లు సమాచారం. ఈ కీలక సాక్ష్యంతో కేసులో మరికొంత మంది ప్రమేయం బయటపడే అవకాశం ఉందని దర్యాప్తు వర్గాలు భావిస్తున్నాయి.
Chevireddy Bhaskar Reddy
AP Liquor Scam
Andhra Pradesh Liquor Case
SIT investigation
Venkatesh Naidu
Hyderabad Farmhouse
Cash Seizure
YSRCP
Election Money Distribution
Liquor Mafia

More Telugu News