జూ.ఎన్టీఆర్ సినిమా కోసం ఆ టైటిల్ వదిలేసి 'కింగ్‌డమ్' అని మార్చుకున్నాం: విజయ్ దేవరకొండ

  • 'కింగ్‌డమ్' చిత్రానికి తొలుత నాగదేవర అనే పేరును ఖరారు చేశామన్న విజయ్ దేవరకొండ
  • ప్రతి సినిమాకు ఒత్తిడి ఉండటం సహజమేనన్న విజయ్ దేవరకొండ
  • 'కింగ్‌డమ్ పార్ట్-2' లో కచ్చితంగా స్టార్ హీరో ఉంటారని వెల్లడి
జూనియర్ ఎన్టీఆర్ కోసం తమ చిత్రం పేరును మార్చుకున్నట్లు సినీ నటుడు విజయ్ దేవరకొండ వెల్లడించారు. 'కింగ్‌డమ్' చిత్రానికి తొలుత 'నాగ దేవర' అనే పేరును ఖరారు చేశామని, ఎన్టీఆర్ 'దేవర' చిత్రం కోసం ఆ టైటిల్‌ను వదులుకున్నట్లు ఆయన తెలిపారు. 'కింగ్‌డమ్' చిత్రం విజయవంతమైన నేపథ్యంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

ప్రతి సినిమాకు ఒత్తిడి ఉండటం సహజమేనని, అదే విధంగా 'కింగ్‌డమ్' విషయంలోనూ ఒత్తిడిని ఎదుర్కొన్నానని ఆయన అన్నారు. ఈ చిత్రం విజయవంతమైతే తదుపరి చిత్రం కోసం మరింత కష్టపడాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. తమ చిత్రానికి తెలుగు, తమిళం భాషల్లో మంచి ఆదరణ లభిస్తోందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

'కింగ్‌డమ్ పార్ట్-2'లో కచ్చితంగా ఒక స్టార్ హీరో నటిస్తారని ఆయన తెలిపారు. అయితే రానా నటిస్తున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని ఆయన స్పష్టం చేశారు. ఆ స్టార్ హీరో ఎవరనేది దర్శకుడు గౌతమ్ వెల్లడిస్తారని ఆయన అన్నారు.

నెగిటివిటీ అనేది సాధారణమని, దాని గురించి తాను పెద్దగా పట్టించుకోనని ఆయన తెలిపారు. పదేళ్ల క్రితం తాను ఎవరికీ తెలియదని, ఇప్పుడు తనను చూడటానికి ఇంతమంది వస్తున్నారంటే అది తన అదృష్టమని ఆయన అన్నారు. 'అర్జున్ రెడ్డి' చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నప్పుడు తనకు గర్వంగా అనిపించిందని ఆయన గుర్తు చేసుకున్నారు. 'కింగ్‌డమ్' సినిమాలో పాటను తొలగించాలనే నిర్ణయం దర్శకుడిదేనని ఆయన స్పష్టం చేశారు. తాను ఏ డైలాగ్ చెప్పినా యాస గురించి మాట్లాడుతున్నారని, ప్రతి విషయంలో యాసను ప్రస్తావిస్తే తాను ఏమీ చేయలేనని ఆయన అన్నారు.


More Telugu News