తెలుగు సినిమా మరోసారి మెరిసింది.. జాతీయ అవార్డ్ గ్ర‌హీత‌ల‌కు చిరంజీవి విషెస్

  • జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల్లో స‌త్తా చాటిన తెలుగు చిత్రాలు 
  • ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు 
  • భార‌తీయ సినిమాకి ఈ అవార్డులు మ‌రింత ప్రోత్సాహాన్ని ఇస్తాయ‌న్న చిరంజీవి 
నిన్న కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌క‌టించిన జాతీయ చ‌ల‌న‌చిత్ర అవార్డుల్లో  తెలుగు చిత్రాలు స‌త్తా చాటిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ప‌లువురు ప్ర‌ముఖులు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తున్నారు. ఈ క్ర‌మంలో మెగాస్టార్ చిరంజీవి త‌న ఎక్స్ (ట్విట్ట‌ర్) ఖాతాలో జాతీయ అవార్డ్ గ్రహీతలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ పెట్టారు. 

“తెలుగు టాలెంట్, తెలుగు సినిమాలు ఈసారి పదికి పైగా విభాగాల్లో అవార్డులు గెలుచుకోవడం చూసి ఎంతో గర్వంగా ఉంది. అవార్డు గెలిచిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా అభినందనలు” అంటూ చిరు రాసుకొచ్చారు. అలాగే బాల‌కృష్ణ‌ న‌టించిన 'భ‌గ‌వంత్ కేస‌రి' చిత్ర బృందానికి ప్ర‌త్యేక శుభాకాంక్ష‌లు తెలియజేశారు. ఈ సంద‌ర్భంగా త‌న పోస్టులో అవార్డులు గెలుచుకున్న వారికి సంబంధించిన జాబితాను కూడా చిరంజీవి పెట్టారు.

ఉత్తమ చిత్రం గా ’12th ఫెయిల్ ఎంపికైంది. ఉత్తమ నటుడు విభాగంలో షారుఖ్ ఖాన్ (జవాన్), విక్రాంత్ మాస్సే (12th ఫెయిల్) ఈ ఇద్దరూ అవార్డు గెలుచుకున్నారు. ఉత్తమ నటిగా రాణీ ముఖర్జీ ఎంపికయ్యారు. ఉత్తమ దర్శకత్వం విభాగంలో సుధీప్తో సేన్ (ది కేరళ స్టోరీ) అవార్డును అందుకున్నారు. ఈ ఏడాది తెలుగు సినిమాకు విశేష గౌరవం లభించింది. తెలుగు టాలెంట్‌తో రూపొందిన సినిమాలకు 10కి పైగా జాతీయ అవార్డులు లభించడం గర్వించదగిన విషయం. తెలుగు సినిమా విజేతలకు ప్రత్యేక అభినందనలు. 

ఉత్తమ తెలుగు చిత్రం-‘భగవంత్ కేసరి, ఉత్తమ ఏవీజీసీ చిత్రం-‘హనుమాన్’ టీమ్, ఉత్తమ కథా చిత్రం స్క్రీన్‌ప్లే-సాయి రాజేశ్‌ (బేబీ), ఉత్తమ బాల నటుడు/నటి-సుకృతివేణి బండి రెడ్డి (గాంధీ తాత చెట్టు), ఉత్తమ యాక్షన్ దర్శకత్వం-నందు, పృథ్వీ (హనుమాన్), ఉత్తమ గీత రచయిత-కాసర్ల శ్యామ్ (ఊరు ప‌ల్లేటూరు పాట-బలగం), ఉత్తమ సంగీత దర్శకులు: జీవీ ప్రకాశ్‌ కుమార్ (వాథీ), హర్షవర్ధన్ రమేశ్వర్ (యానిమల్), ఉత్తమ నేపథ్య గాయకులు రోహిత్ (‘ప్రేమిస్తున్నా’-బేబీ).. ఈ గొప్ప గౌరవం సాధించిన ప్రతీ ఒక్కరికి మనస్పూర్తిగా అభినందనలు. భార‌తీయ సినిమాకి ఈ అవార్డులు మ‌రింత ప్రోత్సాహాన్ని ఇస్తాయ‌ని చిరంజీవి అన్నారు.


More Telugu News