మహేశ్ బాబు ఫౌండేషన్‌ చొరవతో చిన్నారికి గుండె శస్త్ర చికిత్స

  • చిన్నారి వర్షితకు విజయవాడ ఆంధ్ర ఆసుపత్రిలో గుండె శస్త్ర చికిత్స
  • శస్త్ర చికిత్స‌కు సహకరించిన మహేశ్ బాబుకు రుణపడి ఉంటామన్న చిన్నారి తండ్రి  
ప్రముఖ సినీ హీరో మహేశ్ బాబు ఫౌండేషన్ తొమ్మిదేళ్ల చిన్నారికి గుండె శస్త్ర చికిత్స చేయించి పునర్జన్మ ప్రసాదించింది. పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన తొమ్మిదేళ్ల చిన్నారి పిల్లి వర్షితకు మహేశ్ బాబు ఫౌండేషన్ గుండె శస్త్ర చికిత్స చేయించింది.

వివరాల్లోకి వెళితే.. కుముదవల్లికి చెందిన విజయకుమార్, మార్తమ్మ దంపతుల చిన్నారి వర్షితకు పుట్టుకతోనే గుండెలో రంధ్రం ఏర్పడింది. వయసు పెరిగే కొద్దీ దానికదే పూడిపోతుందని అప్పట్లో వైద్యులు చెప్పారు. అయితే, తొమ్మిదేళ్లు వచ్చినా గుండెకు ఉన్న రంద్రం పూడకపోవడంతో అనారోగ్య సమస్యలు తలెత్తాయి.

భీమవరంలో ప్రైవేటు ఆసుపత్రిలో చూపించగా శస్త్ర చికిత్స చేయాలని వైద్యులు తెలిపారు. పెయింటర్‌గా జీవనం సాగించే విజయకుమార్‌కు తన కుమార్తెకు గుండె శస్త్ర చికిత్స చేయించేంత ఆర్ధిక స్థోమత లేక ఆవేదన చెందాడు.

ఈ నేపథ్యంలో భీమవరంలో జిమ్ నిర్వాహకుడు చందు ద్వారా మహేశ్ బాబు ఫౌండేషన్ సభ్యులను సంప్రదించగా, వారు విజయవాడలోని ఆంధ్రా బ్రెయిన్, హార్ట్ ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలో చిన్నారికి గుండె శస్త్ర చికిత్స నిర్వహించారని ఆమె తండ్రి విజయకుమార్ తెలిపాడు.

ప్రస్తుతం తన కుమార్తె కోలుకుంటోందని తెలిపిన విజయకుమార్.. శస్త్ర చికిత్సకు సహకరించిన మహేశ్ బాబుకు రుణపడి ఉంటామని తెలిపారు. మరోవైపు చిన్నారి వైద్య చికిత్సకు పాలకోడేరు ఎస్ఐ రవివర్మ రూ.10 వేల ఆర్ధిక సాయం అందించారని చెప్పారు. 


More Telugu News