ఇండిగో ఫ్లైట్‌లో సహచర ప్రయాణికుడిపై దాడి.. వీడియో ఇదిగో

  • విమానంలో సహచర ప్రయాణికుడిపై ఓ వ్యక్తి చేయిచేసుకున్న వైనం
  • నిందితుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తోటి ప్రయాణికులు
  • కోల్‌కతా ఎయిర్ పోర్టులో పోలీసులకు నిందితుడి అప్పగింత
ఇండిగో విమానంలో ఓ వ్యక్తి హల్‌చల్ చేశాడు. సహచర ప్రయాణికుడిపై చేయి చేసుకున్నాడు. ఈ ఘటన ముంబై - కోల్‌కతా విమానంలో చోటు చేసుకుంది. ప్రయాణికుడిపై చేయి చేసుకున్న వ్యక్తిని కోల్‌కతా విమానాశ్రయంలో పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.

వివరాల్లోకి వెళితే.. ముంబై నుంచి కోల్‌కతా వెళుతున్న ఇండిగో విమానంలో తనతో పాటు ప్రయాణిస్తున్న మరో వ్యక్తిపై ఓ ప్రయాణికుడు చేయి చేసుకున్నాడు. చెంపపై బలంగా కొట్టడంతో అతను తీవ్ర భయాందోళనలకు గురయ్యాడు. ఈ ఘటనతో విమానంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇద్దరు విమాన సిబ్బంది బాధిత వ్యక్తిని ముందుకు తీసుకువెళుతుండగా, నిందితుడు బాధితుడి చెంప చెళ్లుమనిపించాడు.

ఈ ఘటనతో ఇతర ప్రయాణికులు అతనిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అతన్ని ఎందుకు కొట్టావంటూ నిలదీశారు. అతడి వల్ల తనకు సమస్య ఎదురైందని, అందుకే కొట్టానని నిందితుడు చెప్పాడు. ప్రతి ఒక్కరికీ సమస్యలు ఎదురవుతాయని, అంత మాత్రాన వ్యక్తిపై చేయి చేసుకుంటారా? అంటూ మరో వ్యక్తి ప్రశ్నించాడు.

కాగా, ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని పైలట్ ముందుగానే కోల్‌కతా విమానాశ్రయానికి తెలియజేయడంతో అక్కడ విమానం ల్యాండ్ కాగానే నిందితుడిని విమానాశ్రయ పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనను మరో ప్రయాణికుడు తన సెల్ ఫోన్ ద్వారా వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో అది వైరల్‌గా మారింది. 


More Telugu News