మమ్మల్ని సైలెంట్‌గా ఉండమంటారా?.. అంపైర్‌పై కేఎల్ రాహుల్ ఫైర్!

  • ఇంగ్లండ్‌తో టెస్టులో అంపైర్ ధ‌ర్మ‌సేన‌తో గొడవపడ్డ కేఎల్ రాహుల్
  • ప్రసిధ్ కృష్ణ, జో రూట్ మధ్య ఘర్షణతో మొదలైన వివాదం
  • జోక్యం చేసుకున్న అంపైర్‌ను ప్రశ్నించిన రాహుల్
  • రాహుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేసిన అంపైర్ ధర్మసేన
  • "నాతో అలా మాట్లాడొద్దు" అంటూ రాహుల్‌కు వార్నింగ్
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య ఓవల్ మైదానంలో జరుగుతున్న ఆఖ‌రిదైన‌ ఐదో టెస్టు మ్యాచ్ రెండో రోజు ఆటలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. భారత వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్, శ్రీలంకకు చెందిన ఫీల్డ్ అంపైర్ కుమార్ ధర్మసేన మధ్య మైదానంలోనే తీవ్ర వాగ్వాదం జరిగింది. సహచర ఆటగాడికి మద్దతుగా నిలిచిన రాహుల్, అంపైర్‌తో నేరుగా వాగ్వాదానికి దిగడం చర్చనీయాంశమైంది.

అసలేం జరిగిందంటే..?
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భాగంగా 22వ ఓవర్‌లో ఈ ఘటన జరిగింది. భారత పేసర్ ప్రసిధ్ కృష్ణ, ఇంగ్లండ్ బ్యాటర్ జో రూట్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అంపైర్లు కుమార్ ధర్మసేన, అహసాన్ రజా కల్పించుకుని ఇరువర్గాలను శాంతపరిచే ప్రయత్నం చేశారు.

అయితే, అంపైర్ల జోక్యంపై కేఎల్ రాహుల్ అసహనం వ్యక్తం చేశాడు. నేరుగా ధర్మసేన వద్దకు వెళ్లి, "ఏంటి, మమ్మల్ని నిశ్శబ్దంగా ఉండమంటారా?" అని ప్రశ్నించాడు. రాహుల్ తీరుపై ధర్మసేన తీవ్రంగా స్పందించారు. "ఏ బౌలర్ అయినా నీ దగ్గరకు వచ్చి అలా మాట్లాడితే నీకు నచ్చుతుందా? రాహుల్, మనం ఆ మార్గంలో వెళ్లకూడదు" అని సున్నితంగా హెచ్చరించారు.

అయినా వెనక్కి తగ్గని రాహుల్, "మరి మేమేం చేయాలి? కేవలం బ్యాటింగ్, బౌలింగ్ చేసి ఇంటికి వెళ్లిపోవాలా?" అని ఎదురు ప్రశ్నించాడు. ఈ వ్యాఖ్యతో ఆగ్రహానికి గురైన ధర్మసేన, "నాతో అలా మాట్లాడకూడదు" అని గట్టిగా హెచ్చరించారు. అంతేకాకుండా, మ్యాచ్ ముగిసిన తర్వాత తనను వచ్చి కలవాలని రాహుల్‌ను ఆదేశించినట్లు సమాచారం.

ఈ ఘటనతో మైదానంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. ఆటగాళ్లు, అంపైర్ల మధ్య సంబంధాల పరిమితులపై ఈ వివాదం కొత్త చర్చకు దారితీసింది. ఈ విషయంపై ఐసీసీ ఏమైనా క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందా? లేదా? అనేది వేచి చూడాలి.


More Telugu News