పాకిస్థాన్‌కు భారత్ ఝలక్.. చీనాబ్ నదిపై సావల్‌కోట్ ప్రాజెక్టు!

  • సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత
  • జమ్ముకశ్మీర్‌లో కీలక ప్రాజెక్టులపై కేంద్రం దృష్టి
  • సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు చర్యలు
చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టును పునఃప్రారంభించడం ద్వారా పాకిస్థాన్‌కు భారత్ అడ్డుకట్ట వేయనుంది. పహల్గామ్ ఉగ్రదాడి, తదనంతర పరిణామాల నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేసిన తర్వాత భారత్ జమ్ముకశ్మీర్‌లో పలు కీలక ప్రాజెక్టులపై దృష్టి సారించింది. ఈ క్రమంలో ఈ భారీ విద్యుత్ ప్రాజెక్టు పునరుద్ధరణకు సిద్ధమవుతోంది.

చీనాబ్ నదిపై గతంలో నిలిపివేసిన సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ మేరకు నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ ఇటీవల అంతర్జాతీయ టెండర్లను ఆహ్వానించింది. ఇదివరకే తుల్‌బుల్ ప్రాజెక్టు పునరుద్ధరణ చర్యలు చేపట్టింది. చీనాబ్ నదిపై సావల్‌కోట్ జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మించాలనే ప్రతిపాదన 1980ల నుంచే ఉంది.

పాకిస్థాన్ అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఈ ప్రాజెక్టు నిలిచిపోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సింధూ జలాల ఒప్పందం అమలును నిలిపివేయడం, ఈ ప్రాజెక్టు నిర్మాణానికి ఎటువంటి అడ్డంకులు లేకపోవడంతో ప్రభుత్వం దీనిపై దృష్టి సారించింది. 1,856 మెగావాట్ల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నిర్మాణానికి దాదాపు రూ. 22 వేల కోట్లు అవుతుందని అంచనా. దీనిని రెండు దశల్లో నిర్మించనున్నట్లు తెలుస్తోంది.

ఈ ప్రాజెక్టు కోసం అంతర్జాతీయ బిడ్డింగ్‌కు ఉన్న అడ్డంకులను తొలగించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. చివరగా పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి అనుమతులు కూడా రావడంతో ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైనట్లు తెలుస్తోంది.


More Telugu News