డొనాల్డ్ ట్రంప్ 25 శాతం సుంకాల ప్రకటన.. పార్లమెంటులో పీయూష్ గోయల్ ప్రకటన

  • అమెరికా ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు వెల్లడి
  • రానున్న పదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తోందని వ్యాఖ్య
  • ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయన్న పీయూష్ గోయల్
భారత్ ఉత్పత్తులపై 25 శాతం పన్నుతో పాటు అదనపు పెనాల్టీలు విధిస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రకటన చేశారు. అమెరికా ప్రకటించిన సుంకాల ప్రభావంపై అధ్యయనం చేస్తున్నట్లు తెలిపారు. జాతీయ ప్రయోజనాలను కాపాడటానికి అన్ని చర్యలు తీసుకుంటామని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.

రానున్న పదేళ్లలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించే దిశగా భారత్ పయనిస్తోందని అన్నారు. ఏప్రిల్ 2న ట్రంప్ ప్రతీకార సుంకాలపై కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారని తెలిపారు. భారత్ ఉత్పత్తులపై 26 శాతం టారిఫ్ విధిస్తున్నట్లు ప్రకటన చేశారని, తొలుత ఏప్రిల్ 9 నుంచి అమల్లోకి వచ్చేలా షెడ్యూల్ చేశారని తెలిపారు. ఆ తర్వాత దానిని 90 రోజుల పాటు వాయిదా వేశారని తెలిపారు. ఆగస్టు 1 వరకు పొడిగించినట్లు గుర్తు చేశారు.

అప్పటి వరకు 10 శాతం సుంకాలు ఉన్నట్లు తెలిపారు. ఇరుదేశాల మధ్య పరస్పర ప్రయోజనకరమైన ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందం కోసం మార్చిలో చర్చలు ప్రారంభమయ్యాయని తెలిపారు. అక్టోబర్ - నవంబర్ నాటికి ఒప్పందం మొదటి దశను పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.


More Telugu News