సింగపూర్ పర్యటన గ్రాండ్ సక్సెస్ అయింది: మంత్రి నారా లోకేశ్

  • సింగపూర్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి తిరిగి వచ్చిన మంత్రి లోకేశ్ 
  • సచివాలయంలో మీడియా సమావేశం 
  • మొత్తం రూ.45 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని వెల్లడి
సింగపూర్‌ పర్యటన అనంతరం రాష్ట్రానికి తిరిగి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి నారా లోకేశ్ గురువారం నాడు రాష్ట్ర సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ తమ సింగపూర్‌ పర్యటన అత్యంత విజయవంతమైందని ప్రకటించారు. మొత్తం రూ.45 వేల కోట్ల విలువైన పెట్టుబడులకు ఒప్పందాలు కుదిరాయని ఆయన వెల్లడించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర అభివృద్ధిని వేగవంతం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నారని, అందులో భాగంగానే ఈ ప్రత్యేక పర్యటన జరిగిందని లోకేశ్ వివరించారు. ఈ పర్యటనలో తమ విధానం గురించి మాట్లాడుతూ, "మేము ఎంవోయూలు కుదుర్చుకోవడం లేదు. ఒప్పందాల్ని నేరుగా అమలు చేసే దశకు తీసుకొస్తున్నాం" అని స్పష్టం చేశారు. పెట్టుబడుల కోసం ఆర్సెలర్‌ మిట్టల్‌ కంపెనీని జూమ్‌కాల్‌ ద్వారా స్వయంగా ఆహ్వానించామని, దేశంలోనే అతిపెద్ద స్టీల్‌ప్లాంట్‌, డేటా సెంటర్లను ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయబోతున్నామని తెలిపారు.

"2019 నుంచి 2024 మధ్య జగన్‌ పాలనలో ఏపీ బ్రాండ్‌ పూర్తిగా దెబ్బతిన్న పరిస్థితి ఉంది. అమరావతిని కలిసి అభివృద్ధి చేద్దామని సింగపూర్‌ ప్రభుత్వమే ముందుకు వచ్చింది. కానీ, అప్పటి ప్రభుత్వం సింగపూర్‌తో ఉన్న ఒప్పందాల్ని నిర్లక్ష్యంగా రద్దు చేసింది. పారదర్శకతకు పేరుగాంచిన దేశమైన సింగపూర్‌పై అవినీతి ఆరోపణలు మోపారు. అమర్‌రాజా, లులు వంటి కంపెనీలను రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టారు" అని లోకేశ్ గత ప్రభుత్వ తీరును ఎండగట్టారు.

"అయినా ఏపీకి అదృష్టంగా చంద్రబాబు గారు ఉన్నారు. కర్ణాటకకు బెంగళూరు, తమిళనాడుకు చెన్నై ఎలాగో... ఏపీలో  ఐటీ రంగ అభివృద్ధికి విశాఖపట్నంను కేంద్రంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకున్నాం" అని ఆయన పునరుద్ఘాటించారు.

టీసీఎస్‌కు భూ కేటాయింపులపై విలేకరులు అడిగిన ప్రశ్నకు లోకేశ్ స్పందిస్తూ, "టీసీఎస్‌కు ఎకరానికి కేవలం రూ.99 పైసలకే భూమిని కేటాయించాం. ఏ రాష్ట్రం చేయనంతగా మేము ఈ నిర్ణయం తీసుకున్నాం. వైసీపీ నేతలు దీనిపై కోర్టుకెళ్లారు. ఇదే ధరకు మా సొంత కంపెనీ అయిన హెరిటేజ్‌కైనా ఇవ్వలేదు. ఉద్యోగాలు వస్తాయని భావించి టీసీఎస్‌కు ఇచ్చాం. ఇందులో తప్పేం ఉంది?" అని ప్రశ్నించారు.

"వైసీపీ తీసుకొచ్చిన పెట్టుబడులకంటే మేము 14 నెలల్లోనే ఎక్కువ పెట్టుబడులు రప్పించాం. ఇది మా పాలనకి నిదర్శనం" అని లోకేశ్ అన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు రాకుండా వైసీపీ కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. "ఏపీలో పెట్టుబడులు రాకుండా చేయాలనే ఉద్దేశంతో మురళీకృష్ణ అనే వ్యక్తి సింగపూర్‌ అధికారులకు ఈమెయిల్‌ పంపారు. 'రేపో మాపో ప్రభుత్వం మారిపోతుంది' అని అందులో పేర్కొన్నారు. అతడికి వైసీపీ నేతలతో సంబంధాలున్నాయని సమాచారం ఉంది" అని లోకేశ్ పేర్కొన్నారు.

"ఇక తమిళనాడులో పెట్టుబడుల కోసం డీఎంకే, ఏఐడీఎంకే కలిసి పనిచేస్తే, ఏపీలో మాత్రం వైసీపీ నేతలు కంపెనీలకు లేఖలు రాస్తున్నారు. ఇలా లేఖలు రాస్తే పెట్టుబడిదారులు ఎలా ముందుకు వస్తారు? చివరికి నష్టపోయేది తెలుగువారే కదా" అని మంత్రి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News