నోటిని బీమా చేయించుకున్న బ్రిటిష్ నటి సింథియా

  • తన నవ్వు, గొంతుకు ఉన్న ప్రత్యేక కారణంగా రాణిస్తున్నట్లు సింథియా వెల్లడి
  • తన గళాన్ని, విలక్షణ నవ్వును కాపాడుకోవడానికి బీమా చేయించుకున్నట్లు వెల్లడి
  • హాలీవుడ్‌లో అత్యంత విలువైన చిరునవ్వు కలిగిన మహిళగా పేరు
బ్రిటిష్ నటి, గాయకురాలు సింథియా ఎరివో తన నోటికి బీమా చేయించుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇదివరకే పలువురు ప్రముఖులు తమ శరీర భాగాలకు బీమా చేయించుకున్నప్పటికీ, సింథియా నోటిని బీమా చేయించుకోవడం ఆసక్తికరంగా ఉంది. ఆమె మౌత్ వాష్ బ్రాండ్ లిస్టెరిన్ నిర్వహిస్తోన్న 'వాష్ యువర్ మౌత్' కార్యక్రమానికి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నారు. నోటి శుభ్రతకు ఆమె అధిక ప్రాధాన్యత ఇస్తారని స్థానిక మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది.

తన నవ్వు, గొంతులోని ప్రత్యేకత కారణంగానే వృత్తి, వ్యక్తిగత జీవితంలో తాను రాణిస్తున్నానని సింథియా వెల్లడించారు. వేదికపై ప్రదర్శన ఇచ్చే ముందు ప్రతిసారి ఆమె బ్రష్ చేసుకొని, మౌత్ వాష్ ఉపయోగిస్తారట. తన రెండు దంతాల మధ్య ఉన్న ఖాళీని, విలక్షణమైన నవ్వును, గొంతును కాపాడుకోవడానికి ఆమె ఈ బీమా చేయించుకున్నట్లు సమాచారం.

38 ఏళ్ల సింథియా తన నటన, గాత్రంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఎమ్మీ, గ్రామీ, ఆస్కార్, టోనీ వంటి ప్రతిష్ఠాత్మక అవార్డులకు నామినేషన్లు పొందారు. వాటిల్లో ఆస్కార్ మినహా మిగిలిన పురస్కారాలను ఆమె అందుకున్నారు. హాలీవుడ్‌లో ఆమెను అత్యంత విలువైన చిరునవ్వు కలిగిన మహిళగా అభిమానులు పిలుచుకుంటారు.


More Telugu News