ట్రంపా మ‌జాకా.. భారత్‌పై సుంకాలు.. పాక్‌తో వాణిజ్య ఒప్పందాలు!

  • మిత్ర దేశం అంటూనే భారత్‌పై అక్కసును వెళ్లగక్కిన ట్రంప్‌ 
  • ఇండియాపై 25 శాతం సుంకాలతో పాటు జరిమానాలు విధించిన వైనం
  • పాక్‌తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు వెల్ల‌డి
  • భారత్‌కు పాకిస్థాన్‌ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని ట్రంప్ వ్యాఖ్య
'మోదీ నా ఫ్రెండ్‌, ఇండియా మాకు మిత్ర దేశం' అంటూనే భారత్‌పై తన అక్కసును వెళ్లగక్కారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్. 25 శాతం సుంకాలతో పాటు జరిమానాలు కూడా విధించారు. ఈ ప్రకటన చేసిన గంటల వ్యవధిలోనే అటు దాయాది పాకిస్థాన్‌తో ట్రేడ్ డీల్‌ను ప్ర‌క‌టించారు. పాక్‌తో భారీ చమురు నిల్వల అభివృద్ధికి ఒప్పందం కుదిరినట్లు వెల్ల‌డించారు. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే చమురు కంపెనీని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతుందని తన సామాజిక మాధ్యమం ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా తెలిపారు. ఈ సంద‌ర్భంగా భారత్‌కు పాకిస్థాన్‌ ఏదో ఒక రోజు చమురు విక్రయించవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించ‌డం గ‌మ‌నార్హం. 

"ఇవాళ‌ వాణిజ్య ఒప్పందాలకు సంబంధించి వైట్ హౌస్‌లో చాలా బిజీగా గడిపా. పలు దేశాల నేత‌లతో మాట్లాడా. వారంతా అమెరికాను చాలా సంతోష పెట్టాలని అనుకుంటున్నారు. ఈ మధ్యాహ్నం దక్షిణ కొరియాకు చెందిన వాణిజ్య బృందంతో చర్చలు జరుపనున్నా. కొరియా ప్రస్తుతం 25 శాతం సుంకాల జాబితాలో ఉంది. ఆ సుంకాలను తగ్గించుకునే ప్రతిపాద వారి వద్ద ఉంది. అది ఏంటో వినడానికి నేను ఆసక్తిగా ఉన్నా.

ఇప్పుడే పాకిస్థాన్‌తో ఒప్పందం కుదుర్చుకున్నాం. భారీ చమురు నిల్వల అభివృద్ధికి పాక్‌తో ఒప్పందం కుదిరింది. భాగస్వామ్యానికి నాయకత్వం వహించే ఆయిల్‌ కంపెనీని గుర్తించే పనిలో ఉన్నాం. పాకిస్థాన్‌ ఏదో ఒక రోజు భారత్‌కు చమురు విక్రయించవచ్చు. అనేక‌ దేశాలు సుంకాలను తగ్గించుకోవాలని అనుకుంటున్నాయి. ఇవన్నీ మన వాణిజ్య లోటును చాలా పెద్ద ఎత్తున తగ్గించడంలో సహాయపడతాయి" అంటూ త‌న ట్రూత్‌ పోస్టులో ట్రంప్ రాసుకొచ్చారు.

భారత్‌పై 25 శాతం సుంకాలు.. జరిమానాలు
ప్రతీకార సుంకాలకు పెట్టిన గడువు ముగియడానికి రెండు రోజుల ముందు ట్రంప్‌.. బుధవారం భారత్‌పై 25 శాతం టారిఫ్‌లను విధించారు. దీనిపై జరిమానాలు కూడా ఉంటాయని ట్రూత్‌ సోషల్‌ ద్వారా ప్రకటించారు. తమ దేశంలోకి వచ్చే అన్ని భారతీయ ఎగుమతులపై ఆగస్టు 1 నుంచి ఇవి వర్తిస్తాయని అందులో పేర్కొన్నారు. ఇక‌, జరిమానాలు ఎంత? అన్నది మాత్రం ప్రకటించలేదు.

మ‌రోవైపు, ట్రంప్‌ టారిఫ్‌ల ప్రభావాన్ని అధ్యయనం చేస్తున్నామని కేంద్రం తెలిపింది. ఇరు దేశాలకు ప్రయోజనకర వాణిజ్య ఒప్పందం కుదురుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.


More Telugu News