Revanth Reddy: తెలంగాణలో మరో డిస్కం ఏర్పాటు

Revanth Reddy Announces New Discom for Telangana
  • విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష 
  • మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించాలన్న సిఎం రేవంత్ రెడ్డి
  • విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి
  •  రుణాలపై పది శాతం వరకు వడ్డీలు చెల్లిస్తూ డిస్కంలు డీలా పడ్డాయన్న సీఎం
రాష్ట్రంలో మరో విద్యుత్ పంపిణీ సంస్థ (డిస్కం)ను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం ఎస్‌పీడీసీఎల్, ఎన్‌పీడీసీఎల్ ఉండగా, మరో డిస్కం ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేయాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయానికి, ప్రభుత్వ విద్యా సంస్థలకు, గృహ జ్యోతి పథకానికి ఇచ్చే 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌ను కొత్త డిస్కం పరిధిలోకి తీసుకురావాలని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో నిన్న విద్యుత్ శాఖపై సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో విద్యుత్ శాఖ ప్రక్షాళన కోసం సంస్కరణలు చేపట్టాలన్నారు. కొత్త డిస్కం ఏర్పాటు వల్ల ఇప్పుడున్న పంపిణీ సంస్థల పనితీరు మెరుగుపడి, జాతీయ స్థాయిలో రేటింగ్ పెరుగుతుందని అన్నారు.

డిస్కంల పునర్ వ్యవస్థీకరణతో పాటు విద్యుత్ సంస్థలపై ఇప్పుడున్న రుణభారం తగ్గించాలన్నారు. రుణాలపై పది శాతం వరకు వడ్డీలు చెల్లిస్తూ డిస్కంలు డీలా పడ్డాయన్నారు. తక్కువ వడ్డీలు ఉండేలా రుణాలను రీస్ట్రక్చర్ చేసుకునేలా వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులకు సీఎం సూచించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యుత్ సంస్థల్లో సోలార్ విద్యుత్ వినియోగాన్ని అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటు కోసం అనువైన భవనాలను గుర్తించే బాధ్యత కలెక్టర్లు తీసుకోవాలని చెప్పారు. ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
Revanth Reddy
Telangana Discom
Telangana electricity
electricity distribution company
free electricity scheme
Telangana government
solar power
Bhatti Vikramarka

More Telugu News