Google: ఏపీలో గూగుల్ భారీ డేటా సెంటర్... !

Google to Establish Massive Data Center in Andhra Pradesh
  • 6 బిలియన్ డాలర్ల పెట్టుబడితో విశాఖ కేంద్రంగా డేటా సెంటర్  
  • గూగుల్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి!
  • అంతేకాదు... ఆసియాలోనే ఇదే ఫస్ట్ టైమ్!
గూగుల్ సంస్థ ఏపీలో భారీ డేటా సెంటర్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. 6 బిలియన్ డాలర్లు (దాదాపు రూ.50,000 కోట్లు) పెట్టుబడితో విశాఖ కేంద్రంగా 1 గిగా బైట్ సామర్థ్యంతో ఈ డేటా సెంటర్ ను ఏర్పాటు చేయబోతున్నారు. గూగుల్ భారతదేశంలో ఇంత పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం ఇదే మొదటిసారి. అంతేకాదు, ఆసియాలోనే ఇంత పెద్ద డేటా సెంటర్‌ను ఇంత ఎక్కువ ఖర్చుతో నిర్మించడం ఇదే తొలిసారి.

ఈ డేటా సెంటర్‌కు విద్యుచ్ఛక్తి అవసరం కాబట్టి, దానికి సౌరశక్తి (సూర్యరశ్మి నుండి వచ్చే కరెంట్) మరియు పవనశక్తి (గాలి నుండి వచ్చే కరెంట్) కోసం 2 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నారు. అంటే, పర్యావరణానికి హాని లేకుండా కరెంట్ తయారు చేసుకుంటారు.

భారతదేశంలో డిజిటల్ సేవలు వేగంగా పెరుగుతున్నాయి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి గూగుల్ ఈ పెట్టుబడి పెడుతోంది. విశాఖపట్నాన్ని ఎంచుకోవడం వెనుక ఆ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతలు, అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్తున్న మద్దతు కూడా కారణం. ఈ పెట్టుబడితో భారతదేశం, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, టెక్నాలజీ రంగంలో మరింత ముందుకు వెళుతుందని చెప్పవచ్చు. 

ఏపీ ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ సింగపూర్ పర్యటనలో టెక్ దిగ్గజాలతో వరుస భేటీలు నిర్వహించడం తెలిసిందే. సింగపూర్ లో నిన్న జరిగిన బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో నారా లోకేశ్... గూగుల్ క్లౌడ్ డైరెక్టర్ డ్రూ బైన్స్ తో సమావేశమయ్యారు. విశాఖలో డేటా సిటీ స్థాపనకు ఏం కావాలా అన్నీ అందుబాటులోకి తెచ్చామని, వీలైనంత త్వరగా గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని లోకేశ్ కోరారు. ఏపీ ప్రతిపాదనలపై ఉన్నతస్థాయిలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని బైన్స్ హామీ ఇచ్చారు. ఈ క్రమంలోనే, గూగుల్ భారీ డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకు వచ్చినట్టు తెలుస్తోంది.
Google
Google data center
Andhra Pradesh
Nara Lokesh
Visakhapatnam
AP IT
Drew Bains
Google Cloud
India digital services
renewable energy

More Telugu News