20,000 మంది కొత్త వారిని నియమించుకుంటాం!: ఇన్ఫోసిస్ సీఈవో ప్రకటన

  • 2025లో కొత్త వారిని నియమించుకోనున్నట్లు ప్రకటించిన సలీల్ పరేఖ్
  • మొదటి త్రైమాసికంలో 17,000 మందిని నియమించుకున్నట్లు వెల్లడి
  • 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడి
ఈ సంవత్సరం 20,000 మంది కొత్త నియామకాలు చేపట్టాలని భావిస్తున్నట్లు ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ వెల్లడించినట్లు ఆంగ్ల మీడియాలో కథనాలు ప్రచురితమయ్యాయి. 2025లో 20 వేల మంది కాలేజీ గ్రాడ్యుయేట్లను నియమించుకుంటామని ఆయన పేర్కొన్నట్లు మీడియా కథనాల ద్వారా తెలుస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని మొదటి త్రైమాసికంలో ఇప్పటికే 17,000 మందిని నియమించుకున్నట్లు ఆయన తెలిపారు.

కృత్రిమ మేధస్సు (ఏఐ), రీస్కిల్లింగ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు సలీల్ పరేఖ్ వివరించారు. ఇన్ఫోసిస్ ఏఐ సాంకేతికతను ముందుగానే అందిపుచ్చుకుందని ఆయన అన్నారు. ఇప్పటి వరకు ఏఐ, సంబంధిత రంగాలలో 2.75 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇన్ఫోసిస్ కంపెనీ, ఉద్యోగుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని దీర్ఘకాలిక వ్యూహంతో పనిచేస్తోందని సలీల్ పరేఖ్ స్పష్టం చేశారు.

ఐటీ రంగంలో ప్రస్తుతం అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ, ఇన్ఫోసిస్ ఉద్యోగ నియామకాలు చేపట్టడం విశేషం. ఇటీవల టీసీఎస్ 12,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఇది దేశీయ ఐటీ పరిశ్రమలో ఇప్పటివరకు అతిపెద్ద తొలగింపుగా భావిస్తున్నారు. 


More Telugu News