4 వేల టన్నుల బొగ్గు మాయం.. మేఘాలయ మంత్రి వింత వివరణ

  • కొండ ప్రాంతంలోని డిపోలలో నిల్వ చేసిన బొగ్గు
  • భారీ వర్షాలతో వరదలు.. బొగ్గు బంగ్లాదేశ్ లోకి కొట్టుకుపోయిందన్న మంత్రి
  • దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాలలో మేఘాలయ ఒకటి
గనులలో నుంచి వెలికి తీసి డిపోలలో నిల్వ చేసిన బొగ్గు మాయమైంది. ఏకంగా 4 వేల టన్నుల బొగ్గు అటు డిపోలలో లేదు.. ఇటు అమ్మకాల లెక్కల్లోనూ కనిపించడంలేదు. మేఘాలయలో చోటుచేసుకుందీ ఘటన. అయితే, బొగ్గు మాయం కావడమే వింత అనుకుంటే దీనిపై ఆ రాష్ట్ర మంత్రి ఇచ్చిన వివరణ వింతల్లోకెల్లా వింతగా మారింది. డిపోలలో నిల్వ చేసిన బొగ్గు వర్షాలకు కొట్టుకుపోయిందని మంత్రి వ్యాఖ్యానించడం ప్రస్తుతం మేఘాలయలో చర్చనీయాంశంగా మారింది.

ఏంజరిగింది..
రాజాజు, దియంగన్‌ గ్రామాల్లోని గల రెండు బొగ్గు నిల్వ కేంద్రాల నుంచి ఇటీవల దాదాపు 4వేల టన్నుల బొగ్గు మాయమైంది. అక్రమంగా తరలించి ఉంటారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై విచారణ జరిపిన రాష్ట్ర హైకోర్టు.. ప్రభుత్వాన్ని మందలించింది. బొగ్గు అదృశ్యం వెనక బాధ్యులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.

మంత్రి వివరణ..
దేశంలోనే అత్యధిక వర్షపాతం నమోదయ్యే రాష్ట్రాలలో మేఘాలయ కూడా ఒకటని మంత్రి కీర్మెన్ షిల్లా పేర్కొన్నారు. మేఘాలయలో కురిసిన భారీ వర్షాలకు పక్కనే ఉన్న అస్సాంలో వరదలు వచ్చాయంటూ గతంలో జరిగిన ప్రచారాన్ని మంత్రి గుర్తుచేశారు. భారీ వర్షాలు, వరదలకు ఏదైనా జరగొచ్చని వివరించారు. తూర్పు జైంతియా హిల్స్ నుంచి వరద నీరు బంగ్లాదేశ్ లోకి ప్రవహిస్తుందని చెప్పారు. ఈ క్రమంలోనే బొగ్గు నిల్వ చేసిన గ్రామాల్లో వరదలు వచ్చి బొగ్గు బంగ్లాదేశ్ లోకి కొట్టుకుపోయి ఉండొచ్చని మంత్రి కీర్మెన్ షిల్లా చెప్పారు. అక్రమ తరలింపు ఆరోపణలకు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లభించలేదని, విచారణ జరిపిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


More Telugu News