Chandrababu: సింగపూర్ బిడదారి ఎస్టేట్‌లో రెండు గంటల పాటు కాలి నడకన పర్యటించిన సీఎం చంద్ర‌బాబు

Chandrababu Naidu Visits Bidadari Estate in Singapore
  • సింగపూర్ లో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన
  • 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సందర్శించిన సీఎం బృందం
  • అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటన
  • ఏపీ, అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని చంద్రబాబు పిలుపు
సింగపూర్ లో సీఎం చంద్రబాబు రెండో రోజు పర్యటన కొనసాగుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి ప‌ది వేల కుటుంబాలు నివాసం ఉండే బిడదారి ఎస్టేట్ లో రెండు గంటల పాటు కాలి నడకన పర్యటించారు. సిటీ ఇన్ ఎ గార్డెన్ పేరుతో ఏర్పాటైన  హౌసింగ్ ప్రాజెక్ట్ విశిష్టతలను సీఎంకు సింగపూర్ అధికారులు వివరించారు. బిడదారి హౌసింగ్ ప్రాజెక్టును సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు తీర్చిదిద్దింది. 250 ఎకరాల్లో విస్తరించిన సింగపూర్ ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టును సీఎం బృందం సందర్శించింది.

10 వేల కుటుంబాలు నివాసం ఉండేలా అన్ని వసతులతో పర్యావరణహితంగా నివాస సముదాయాన్ని సింగపూర్ ప్రభుత్వం నిర్మించింది. శ్మశాన ప్రాంతాన్ని సింగపూర్ అర్బన్ రీడెవల్పమెంట్ అథారిటీ సుందరమైన పార్క్ గా మార్చింది. అర్బన్ హౌస్ ప్లానింగ్ లో భాగంగా బిడదారి ఎస్టేట్ లో సీఎం బృందం పర్యటించింది. ఈ సంద‌ర్భంగా  సింగపూర్ అధికారులు చెట్లు తొలగించకుండా, సహజ నీటి వనరులు దెబ్బతినకుండా నిర్మాణాలు చేపట్టిన విధానాన్ని వివరించారు. 

అనంతరం సింగపూర్ హౌసింగ్ డెవలప్మెంట్ బోర్డు, సింగపూర్ అర్బన్ రీడెవలప్మెంట్ అథారిటీ, సింగపూర్ కార్పోరేషన్ ఎంటర్ ప్రైజ్ సహా ప్రపంచ బ్యాంకు అధికారులతో సీఎం బృందం సమావేశమైంది. రాజధాని అమరావతి నిర్మాణంలో అనుసరిస్తున్న విధానాలు, ఆలోచనలు, ప్రణాళికలను వారితో పంచుకున్నారు. ఏపీలో చేపట్టనున్న  అర్బన్ హౌసింగ్ ప్రాజెక్టుల్లో సింగపూర్ సహకారంపై ఈ సమావేశంలో చర్చించారు. బిడదారి ప్రాజెక్ట్ ను రూపొందించిన విధానం చాలా గొప్పగా ఉందని సీఎం చంద్రబాబు కితాబిచ్చారు. 

పర్యావరణం దెబ్బతినకుండా చేపట్టిన అర్బన్ ప్రాజెక్టు అద్భుతంగా ఉందని కొనియాడారు. ఇక‌, అమరావతి అనేది కొత్త ఆలోచనలతో, అధునిక వసతులతో నిర్మాణం అవుతున్న కొత్తనగరం అని చంద్రబాబు తెలిపారు. ఉత్తమ విధానాలు, అనుభవాలను ఉపయోగించి కొత్త నగరాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. సింగపూర్ ఇప్పటికే  మాస్టర్ ప్లాన్ ఇచ్చిందని, నిర్మాణంలో వరల్డ్ బ్యాంక్ కూడా భాగస్వామి అవుతోందని వివ‌రించారు. 

గతంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా సింగపూర్.. ఏపీ ప్రభుత్వాల మధ్య‌ కొన్ని సమస్యలు వచ్చాయని సీఎం గుర్తు చేశారు. కొన్ని నిర్ణయాల కారణంగా రాష్ట్రం నమ్మకాన్ని కోల్పొయిందని, గతంలో జరిగిన తప్పులను సరిదిద్దడానికి  సింగపూర్ వచ్చానని అన్నారు. ఏపీ, అమరావతిలో చేపట్టే హౌసింగ్ ప్రాజెక్టుల్లో భాగస్వాములు కావాలని ఈ సంద‌ర్భంగా సింగపూర్ హౌసింగ్ డెవల్మెంట్ బోర్డును సీఎం చంద్రబాబు కోరారు. 
Chandrababu
Singapore
Andhra Pradesh
Amaravati
Housing Project
Urban Development
Bidadari Estate
World Bank
Singapore Housing Development Board
AP Government

More Telugu News