మాంచెస్టర్ టెస్ట్‌లో హై వోల్టేజ్ డ్రామా.. బెన్ స్టోక్స్‌తో వివాదం.. సుందర్, జడేజాకు గంభీర్ మద్దతు

  • మాంచెస్టర్ టెస్ట్ చివరి నిమిషాల్లో ఉద్రిక్తత
  • రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ శతకాలను అడ్డుకునేందుకు బెన్‌స్టోక్స్ డ్రా ప్రతిపాదన
  • నిరాకరించడంతో నోటికి పనిచెప్పిన ఇంగ్లిష్ ఆటగాళ్లు
  • మ్యాచ్ అనంతరం షేక్‌హ్యాండ్‌కు నిరాకరణ
ఇంగ్లండ్‌తో జరిగిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్ చివరి నిమిషాల్లో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారత బ్యాటర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్‌ సెంచరీలకు చేరువలో ఉండగా ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆఫర్ చేసిన డ్రా ప్రతిపాదనను తిరస్కరించారు. చిరస్థాయిగా నిలిచే ఈ మైలురాయిని సాధించాలనే వారి పట్టుదల స్టోక్స్‌ను విసిగించింది. ఆ తర్వాత మైదానంలో జరిగిన వాగ్వాదం మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చింది.

మ్యాచ్ చివరి ఓవర్లలో జడేజా 90లలో, సుందర్ 85లో ఉండగా, స్టోక్స్ డ్రాకు ప్రతిపాదించాడు. అయితే, ఈ ఇద్దరు భారత బ్యాటర్లు ఆ ప్రతిపాదనను తిరస్కరించి సెంచరీల కోసం ఆడటం కొనసాగించారు. ఈ సమయంలో ఇంగ్లండ్ ఆటగాళ్లు, ముఖ్యంగా జో రూట్,  జాక్ లీచ్.. జడేజాపై మాటల దాడితో దాడిచేశారు. అయినప్పటికీ జడేజా తన 8వ టెస్ట్ సెంచరీని (104 నాటౌట్), సుందర్ తన తొలి టెస్ట్ సెంచరీని (100 నాటౌట్) సాధించారు. మ్యాచ్ అనంతరం హ్యాండ్‌షేక్ సమయంలో స్టోక్స్ ఈ ఇద్దరు భారత ఆటగాళ్లను పట్టించుకోకుండా అవమానించడం మరో వివాదానికి దారితీసింది.

గౌతమ్ గంభీర్ సూటి స్పందన
మ్యాచ్ అనంతర ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్.. జడేజా, సుందర్‌లకు పూర్తి మద్దతు ప్రకటించాడు. తనదైన శైలిలో ఇంగ్లండ్ ఆటగాళ్లపై ప్రశ్నలు సంధించాడు. "90 లేదా 85 వద్ద బ్యాటింగ్ చేస్తున్న ఆటగాడు సెంచరీకి అర్హుడు కాదా? ఒకవేళ ఇంగ్లండ్ ఆటగాడు తన తొలి టెస్ట్ సెంచరీకి 90 లేదా 85 వద్ద ఉంటే వారు మైదానం విడిచి వెళ్లిపోతారా? వారికి ఆ అవకాశం ఇవ్వరా?" అని గంభీర్ ప్రశ్నించాడు. "ఇది వారి ఇష్టం. ఆ ఇద్దరూ సెంచరీకి అర్హులు, వారు దాన్ని సాధించారు" అని స్పష్టం చేశాడు. భారత కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కూడా ఈ ఇద్దరిని సమర్థించాడు.  "సెంచరీ సాధించడం వారి హక్కు" అని అన్నాడు. స్టోక్స్ మాత్రం తన బౌలర్లను కాపాడుకోవడానికే డ్రా ఆఫర్ చేసినట్టు వాదించాడు.

ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన ఈ టెస్ట్ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత ప్రదర్శన చేసింది. భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసి మ్యాచ్‌ను డ్రా చేసుకుంది. దీంతో  సిరీస్‌ను డ్రా చేసుకునే అవకాశాన్ని భారత్ సజీవంగా ఉంచింది. ఇప్పుడు భారత జట్టు లండన్‌లో జరిగే తదుపరి టెస్ట్‌లో సిరీస్‌ను సమం చేసే లక్ష్యంతో బరిలోకి దిగనుంది. గత ఇంగ్లండ్ టూర్‌లో భారత్ 2-2తో సిరీస్‌ను డ్రా చేసుకున్న విషయం తెలిసిందే.


More Telugu News