యూపీలో లవ్ జిహాద్.. కిడ్నాప్ చేసి బలవంతంగా మూత్రం తాగించారు!

  • బర్త్ డే పార్టీకి వెళ్తుండగా యువకులను అడ్డుకున్న గ్రూప్
  • కిడ్నాప్ చేసి నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడి
  • పాత కక్షల కారణంగానే దాడి జరిగిందన్న పోలీసులు
ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్ జిల్లాలో జరిగిన ఓ ఘటన వెలుగులోకి వచ్చి కలకలం రేపింది. గతంలో 'లవ్ జిహాద్' కేసు గురించి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఇద్దరు హిందూ యువకులు తాజాగా మరో ఫిర్యాదు చేస్తూ కొందరు వ్యక్తులు తమను కిడ్నాప్ చేసి, దుస్తులు విప్పించి, తీవ్రంగా హింసించారని ఆరోపించారు. ఈ నెల 23న జరిగిన ఈ దారుణంపై చందన్ మౌర్య అనే యువకుడు రామ్‌గావ్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటపడింది.

చందన్ ఫిర్యాదు ప్రకారం.. తాను, బంధువు మోహిత్, స్నేహితుడు అన్షు కలిసి ఫ్రెండ్ బర్త్ డే వేడుకకు వెళ్తుండగా మెహరీ బైఖా గ్రామం వద్ద షాబుద్దీన్, మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అడ్డుకున్నాడు. అనంతరం అనాస్, జీషాన్ అనే మరో ఇద్దరు స్నేహితులు వచ్చి చేరారు. అందరూ కలిసి చందన్, మోహిత్‌లను బలవంతంగా ఒక వాహనంలోకి ఎక్కించి, నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి దాడికి పాల్పడ్డారు.

వారి దుస్తులు పూర్తిగా విప్పించి ఇనుప రాడ్లు, కర్రలతో దారుణంగా కొట్టారు. అంతేకాదు, నీళ్లు ఇవ్వడానికి నిరాకరించి మూత్రం తాగమని బలవంతం చేశారని చందన్ వాపోయాడు. అంతటితో ఆగకుండా, తుపాకీ గురిపెట్టి "ఇస్లాం జిందాబాద్" అని నినాదాలు చేయమని ఒత్తిడి చేశారని ఆరోపించారు.

పోలీసులు ఏం చెబుతున్నారు?
పాత కక్షల కారణంగా ఈ దాడి జరిగిందని అడిషనల్ ఎస్పీ దుర్గా ప్రసాద్ తివారీ తెలిపారు. "ప్రాథమిక విచారణలో ఈ రెండు వర్గాల మధ్య వ్యక్తిగత శత్రుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. కేసు నమోదు చేశాం. షాబుద్దీన్, అనాస్, జీషాన్ అనే ముగ్గురు నిందితులను అరెస్టు చేశాం" అని ఆయన వెల్లడించారు. మటేరా సమీపంలో బాధితులను రక్షించామని, కిడ్నాప్‌కు ఉపయోగించిన కారును కూడా స్వాధీనం చేసుకున్నామని తివారీ చెప్పారు.


More Telugu News