ఐటీ పార్కు హైదరాబాద్, బెంగళూరు వెళుతోంటే మీకేం పట్టడం లేదు!: మహారాష్ట్ర ఉపముఖ్యమంత్రి వ్యాఖ్యలు

  • నిర్వహణ లోపం వల్ల హింజేవాడిలోని ఐటీ పార్కు తరలిపోతోందంటూ ఆందోళన
  • మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామని అసహనం
  • హింజేవాడిలో 2,800. ఎకరాల్లో రాజీవ్ గాంధీ ఐటీ పార్కు
మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిర్వహణ లోపం కారణంగా హింజేవాడిలోని ఐటీ పార్కు హైదరాబాద్, బెంగళూరుకు తరలిపోతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఉదయం ఆయన పుణే సమీపంలోని పింప్రీ చించ్వాడ్‌లో పలు ప్రాంతాలను పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు.

అక్రమ నిర్మాణాల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ గణేశ్ జంబూల్కర్ అజిత్ పవార్‌తో మాట్లాడారు. ప్రజా సమస్యలపై మీడియా ఎదుటే సర్పంచ్ ప్రశ్నించడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

మనల్ని మనమే నాశనం చేసుకుంటున్నామని ఆయన తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. హింజేవాడి నుంచి ఐటీ పార్క్ బెంగళూరు, హైదరాబాద్‌కు తరలిపోతున్నప్పటికీ మీకు ఏమీ పట్టడంలేదని ఆయన మండిపడ్డారు. మరోవైపు, కెమెరాలను ఆపాలని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

కాగా, మహారాష్ట్రలోని హింజేవాడిలో 2,800 ఎకరాల్లో రాజీవ్ గాంధీ ఐటీ పార్కు ఉంది. అందులో 800 కంపెనీలు తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి.


More Telugu News