21 వారాలకే జన్మించి గిన్నిస్ రికార్డులకెక్కిన బాలుడు!

  • ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో జన్మించిన బాలుడు
  • 285 గ్రాముల బరువు, 24 సెంటీమీటర్ల పొడవుతో బాలుడి జననం
  • ఇటీవలే తొలి పుట్టిన రోజు జరుపుకొన్న బాలుడు
అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కేవలం 21 వారాలకే జన్మించిన ఒక బాలుడు ప్రపంచంలోనే అతి తక్కువ కాలంలో పుట్టిన ప్రీమెచ్యూర్ బేబీగా గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఈ చిన్నారి పేరు నాష్ కీన్. గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రకారం.. 2024 జులై 5న అయోవా సిటీలోని అయోవాలో బాలుడు జన్మించాడు. జనన సమయంలో అతడి బరువు కేవలం 10 ఔన్సులు (285 గ్రాములు). పుట్టాల్సిన తేదీ కంటే 133 రోజులు (దాదాపు 19 వారాలు) ముందుగానే జన్మించాడు. ఈ నెల ప్రారంభంలో తన మొదటి పుట్టినరోజు జరుపుకున్న తర్వాత, అతడు అధికారికంగా గిన్నిస్ వరల్డ్ రికార్డును అందుకున్నాడు. 2020లో అలబామాలో జన్మించిన గత రికార్డ్ హోల్డర్‌ను కేవలం ఒక రోజు తేడాతో నాష్ అధిగమించాడు.

తల్లిదండ్రుల ఆనందం 
‘నాష్ పొటాటో’ అని ముద్దుగా పిలుచుకునే ఈ శిశువు యూనివర్సిటీ ఆఫ్ అయోవా హెల్త్ కేర్ స్టెడ్ ఫ్యామిలీ చిల్డ్రన్స్ హాస్పిటల్‌లోని ‘నియోనాటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్’ (ఎన్‌ఐసీయూ) లో ఆరు నెలలు గడిపిన తర్వాత, జనవరి 2025లో తన తల్లిదండ్రులైన మోలీ, రాండాల్ కీన్‌లుతో ఇంటికి వెళ్లాడు.

నాష్ తల్లి మోలీ మాట్లాడుతూ.. ‘‘ఇది నిజంగా నమ్మలేకుండా ఉంది. ఏడాది క్రితం భవిష్యత్తు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇప్పుడు మేము అతడి మొదటి పుట్టినరోజును జరుపుకున్నాం. అతడి ప్రయాణం ఎంత భిన్నంగా ఉందో, అంతే బాధగా కూడా ఉంది. కానీ అన్నింటికీ మించి ఇది ఒక విజయంలా అనిపిస్తుంది’’ అని పేర్కొన్నారు. నాష్ చాలా దూరం వచ్చాడని, ఈ మైలురాయి కేవలం ఒక సంవత్సరం చేరుకోవడం గురించి మాత్రమే కాదని, ఇది స్థిరత్వం, ఆశ, అతడు ఇక్కడికి చేరుకోవడానికి అధిగమించిన ప్రతి కష్టం గురించి అని ఆమె వివరించింది.  

‘‘నాష్ కేవలం రికార్డ్ బ్రేకర్ మాత్రమే కాదు. అతడు మా హృదయాలను గెలుచుకున్నాడు. నాష్ స్థానికంగా, దేశవ్యాప్తంగా కొంత పేరు సంపాదించుకున్నాడు. అతడి కథ మన సమాజంలో, దేశవ్యాప్తంగా చాలా మంది హృదయాలను తాకింది" అని ఆమె పేర్కొంది.

జననం సమయంలో నాష్ బరువు కేవలం 285 గ్రాములు. ఒక గ్రేప్‌ఫ్రూట్ కంటే తక్కువ. పొడవు 24 సెంటీమీటర్లు మాత్రమే. "నాష్ చాలా చిన్నగా ఉన్నాడు. నా ఛాతీపై అతను ఉన్నట్లు నాకు దాదాపు అనిపించలేదు" అని మోలీ గుర్తు చేసుకుంది. 


More Telugu News