క్రికెట్ తరహాలో భారత్-బ్రిటన్ మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం: ప్రధాని మోదీ

  • బ్రిటన్ లో పర్యటిస్తున్న భారత ప్రధాని మోదీ
  • చారిత్రక ఒప్పందంపై సంతకాలు
  • భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైందన్న మోదీ 
బ్రిటన్ తో కీలక వాణిజ్య ఒప్పందం అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఆయన బ్రిటన్ పర్యటనలో ఉన్నారు. బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. క్రికెట్ అనేది కేవలం ఒక ఆట మాత్రమే కాదని, అది ఒక ప్యాషన్ అని అభివర్ణించారు. క్రికెట్ తరహాలో భారత్-బ్రిటన్ దేశాల మధ్య దీర్ఘకాల భాగస్వామ్యం కోరుకుంటున్నామని తెలిపారు. 

“ఈ ఒప్పందంతో భారత్-బ్రిటన్ భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైంది. ఇరుదేశాలు విజన్-2035 లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. రక్షణ, భద్రత, కృత్రిమ మేధ (ఏఐ), విద్య, సైబర్ సెక్యూరిటీ, ఇతర రంగాల్లో కలిసి ముందుకు సాగాలని నిర్ణయించాం. 6 బ్రిటన్ వర్సిటీలు భారత్ లో క్యాంపస్ లు ఏర్పాటు చేస్తున్నాయి” అని వివరించారు. 

ఇక, పహల్గామ్ ఉగ్రదాడిని ఖండించిన బ్రిటన్ ప్రధానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నానని వెల్లడించారు. “తీవ్రవాదం విషయంలో రెండు అభిప్రాయాలకు చోటు లేదు. ప్రజాస్వామ్య స్వేచ్ఛను దుర్వినియోగం చేసేవారి పట్ల కఠినంగా ఉంటాం. పలు దేశాల మధ్య తలెత్తుతున్న ఉద్రిక్తతల పట్ల ఆందోళన చెందుతున్నాం. ప్రపంచ దేశాల మధ్య శాంతి పెంపొందించే విషయంలో భారత్-బ్రిటన్ కలిసి ముందుకు సాగుతాయి. ఇది విస్తరణ వాదానికి కాలం కాదు… ఇది శాంతికి సమయం” అని మోదీ స్పష్టం చేశారు. 

అటు, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనపైనా ప్రధాని మోదీ స్పందించారు. “అహ్మదాబాద్ విమాన దుర్ఘటనలో బ్రిటన్ లోని ఎన్నారైలు కూడా ఉన్నారు. విమాన ప్రమాద మృతులకు మరోసారి సంతాపం తెలుపుతున్నాను. ఎన్నారైలు భారత సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతున్నారు. బ్రిటన్ ప్రధాని ఆతిథ్యానికి ధన్యవాదాలు… భారత్ కు రావాలని ఆయనను ఆహ్వానిస్తున్నాను” అని పేర్కొన్నారు.


More Telugu News