'ఎస్ఎస్ఎంబీ29' అప్‌డేట్‌.. ఎవ‌రూ ఊహించ‌నిరీతిలో క‌థ‌.. విజువ‌ల్స్ ట్రీట్‌: పృథ్వీరాజ్ సుకుమార‌న్

  • మ‌హేశ్ బాబు, రాజ‌మౌళి కాంబోలో  'ఎస్ఎస్ఎంబీ29' 
  • కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న పృథ్వీరాజ్ సుకుమార‌న్ 
  • ఆయ‌న న‌టించిన తాజా చిత్రం 'స‌ర్జ‌మీన్' 
  • తాజాగా చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో పాల్గొన్న మ‌ల‌యాళ న‌టుడు
  • ఈ సంద‌ర్భంగా మ‌హేశ్‌-జ‌క్క‌న్న చిత్రంపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
టాలీవుడ్ సూప‌ర్ స్టార్ మ‌హేశ్ బాబు, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు ఎస్ఎస్ రాజ‌మౌళి కాంబినేష‌న్‌లో ఒక మూవీ తెర‌కెక్కుతున్న విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉన్న ఈ ప్రాజెక్టు 'ఎస్ఎస్ఎంబీ29' పేరుతో ప్ర‌చారంలో ఉంది. ఇక‌, ఈ భారీ ప్రాజెక్టులో మ‌ల‌యాళ న‌టుడు పృథ్వీరాజ్ సుకుమార‌న్ కూడా కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. 

అయితే, తాజాగా ఆయ‌న న‌టించిన 'స‌ర్జ‌మీన్' చిత్ర ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా 'ఎస్ఎస్ఎంబీ29' గురించి ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. మ‌హేశ్‌-జ‌క్క‌న్న చిత్రం గురించి సుకుమార‌న్ మాట్లాడుతూ... "ఇప్ప‌టివ‌ర‌కు ఎవ‌రూ ఊహించ‌నిరీతిలో ఈ క‌థ‌ను రాజ‌మౌళి తీర్చిదిద్దుతున్నారు. అదొక అద్భుత దృశ్య కావ్యం. రాజ‌మౌళి స‌ర్ ఎంచుకునే క‌థ‌ల‌న్నీ కూడా భారీగానే ఉంటాయి. ఇది కూడా అలాంటిదే. ఎందుకంటే ప్ర‌తిఒక్క‌రినీ మెప్పించేలా క‌థ‌ను చెప్ప‌డంలో ఆయ‌న సిద్ధ‌హ‌స్తుడు. ఈ చిత్రాన్ని విజువ‌ల్స్ ట్రీట్‌గా తీర్చిదిద్దుతున్నారు" అని తెలిపారు. 

కాగా, ప్ర‌స్తుతం ఈ భారీ ప్రాజెక్టు షూటింగ్‌కు చిత్ర బృందం కాస్త విరామం ఇచ్చింది. విహార‌యాత్ర‌లో భాగంగా హీరో మ‌హేశ్ త‌న ఫ్యామిలీతో క‌లిసి శ్రీలంక‌కు వెళ్లారు. అలాగే కీలక పాత్ర‌లో న‌టిస్తున్న న‌టి ప్రియాంక చోప్రా కూడా బ‌హ‌మాస్‌లో సేద తీరుతున్నారు. ఆగ‌స్టులో తిరిగి షూటింగ్ ప్రారంభిస్తార‌ని తెలుస్తోంది. ఇక‌, ఈ మూవీ కోసం సినీ ల‌వ‌ర్స్ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న విష‌యం తెలిసిందే. 


More Telugu News