ర‌విశాస్త్రి ఆల్‌టైమ్ గ్రేట్ టాప్‌-5 భార‌త క్రికెట‌ర్లు వీరే.. గంగూలీ, ద్ర‌విడ్‌, రోహిత్‌కు ద‌క్క‌ని చోటు

  • గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్, కోహ్లీ, ధోనీల‌ను ఎంచుకున్న ర‌విశాస్త్రి
  • వీరిలో నంబ‌ర్ వ‌న్ ప్లేస్ స‌చిన్‌కు
  • 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడి, 100 సెంచరీలు 
  • అన్ని తరాల బౌలర్లను ఎదుర్కొని పరుగులు సాధించాడ‌ని కితాబు
టీమిండియా మాజీ కోచ్, మాజీ ఆటగాడు రవిశాస్త్రి తన ఆల్ టైమ్ టాప్-5 భారత క్రికెటర్ల జాబితాను ప్రకటించాడు. అయితే, ఇందులో రాహుల్ ద్రవిడ్, సౌరవ్ గంగూలీ, అనిల్ కుంబ్లే, రోహిత్ శర్మ లాంటి ప్రముఖ క్రికెట‌ర్లు లేక‌పోవ‌డంతో క్రికెట్ అభిమానుల్లో పెద్ద చర్చకు దారితీసింది. ఇటీవ‌ల రవిశాస్త్రి.. మైఖేల్ వాన్, అలెస్ట‌ర్ కుక్, డేవిడ్ లాయిడ్, ఫిల్ టఫ్నెల్‌ల‌తో క‌లిసి స్టిక్ టు క్రికెట్ పాడ్‌కాస్ట్‌లో అతిథిగా పాల్గొన్నాడు. 

ఈ క్ర‌మంలో వారు ఆల్ టైమ్ టాప్-5 భారత క్రికెటర్లను ఎంచుకోవాల‌ని ర‌విశాస్త్రిని అడిగారు. దాంతో ఆయ‌న సునీల్ గవాస్కర్, కపిల్ దేవ్, సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ, ఎంఎస్ ధోనీ పేర్ల‌ను చెప్పాడు. అంతేగాక ఆ ఐదుగురిలో సచిన్‌ను నంబర్ వ‌న్‌గా పేర్కొన్నాడు. 24 ఏళ్ల పాటు క్రికెట్ కెరీర్‌ను కొన‌సాగించిన మాస్ట‌ర్‌బ్లాస్ట‌ర్ 100 శ‌త‌కాలు బాదాడ‌ని, త‌న త‌రంలో ప్ర‌తి ఒక్క పేస్ బౌలింగ్ అటాక్ ఎదుర్కొన్న గొప్ప బ్యాట‌ర్ అని కొనియాడాడు. 

వసీం అక్రం, వకార్ యూనిస్, ఇమ్రాన్ ఖాన్ లతో ఆడటం ప్రారంభించాడ‌ని, ఆ తరువాత స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ ఆండర్సన్, జాక్వెస్ కలిస్, షాన్ పొలాక్, అలన్ డోనాల్డ్ వంటి దిగ్గ‌జ పేస‌ర్ల‌ను కాచుకుని ప‌రుగులు చేశాడ‌ని రవిశాస్త్రి పేర్కొన్నాడు.  


More Telugu News