ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మ‌రో విద్యార్థి అనుమానాస్పద మృతి.. నాలుగు రోజుల్లో రెండో ఘ‌ట‌న‌

  • నిన్న రాత్రి చ‌నిపోయిన సెకండియ‌ర్‌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి చంద్రదీప్ పవార్
  • ఈ నెల‌18న నాలుగో సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ మృతి
  • నాలుగు రోజుల వ్య‌వ‌ధిలో ఐఐటీ క్యాంప‌స్ లో రెండు అనుమానాస్ప‌ద మ‌ర‌ణాలు
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ) ఖరగ్‌పూర్‌లో మ‌రో విద్యార్థి అనుమానాస్పదస్థితిలో మృతిచెందాడు. సెకండియ‌ర్‌ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విద్యార్థి చంద్రదీప్ పవార్ సోమవారం రాత్రి చ‌నిపోయాడు. కాగా, గత నాలుగు రోజుల్లో ఆ సంస్థ క్యాంపస్‌లో జ‌రిగిన రెండవ సంఘటన ఇది.

ఈ నెల‌18న నాలుగో సంవత్సరం మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థి రితం మండల్ మృతదేహం అతని హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో క‌నిపించిన విష‌యం తెలిసిందే.

కాగా, సోమవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చంద్రదీప్ వైద్యుడి సలహా మేరకు ఏదో మెడిసిన్ వాడిన‌ట్లు స్థానిక పోలీసులకు ఇన్‌స్టిట్యూట్ అధికారులు తెలియజేశారు. అతడు తీసుకున్న‌ టాబ్లెట్ శ్వాసనాళంలో ఇరుక్కుపోయి, చివరికి అతని మరణానికి కార‌ణ‌మై ఉండొచ్చ‌ని పోలీసులు అనుమానం వ్య‌క్తం చేశారు.

మధ్యప్రదేశ్ నివాసి అయిన చంద్రదీప్‌ను మొద‌ట‌ ఐఐటీ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అక్కడి వైద్యులు అప్ప‌టికే అత‌డు చనిపోయినట్లు ప్రకటించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపారు. అతని మరణానికి అసలు కారణం శవపరీక్ష నివేదిక వచ్చిన తర్వాతే తెలుస్తుంద‌ని అధికారులు వెల్ల‌డించారు.

స్థానిక పోలీసులు ఈ విషయంపై దర్యాప్తు ప్రారంభించారు. మృతుడి కుటుంబ సభ్యులకు సోమవారం రాత్రే సమాచారం అందించడంతో వారు మంగళవారం ఉదయం ఖరగ్‌పూర్ చేరుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా చంద్రదీప్‌ ఒక రకమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్లు స‌మాచారం. అందువల్ల అతని మరణంపై కొంత గందరగోళం నెల‌కొందని ఇన్‌స్టిట్యూట్‌లోని ఒక అధికారి తెలిపారు.


More Telugu News