అమ్మను అవమానించాడని హత్య.. పదేళ్ల పాటు వీధులన్నీ గాలించి, 3 నెలలు ప్లాన్ చేసిన కొడుకు

  • పనయ్యాక పార్టీ ఇస్తానంటూ స్నేహితులకు ఆఫర్
  • నలుగురు స్నేహితులతో కలిసి హత్య చేసిన వైనం
  • పార్టీ చేసుకున్న ఫొటోలు నెట్ లో వైరల్ గా మారడంతో పట్టుబడ్డ నిందితులు
కన్నతల్లిని అవమానించాడని కొడుకు పగ పెంచుకున్నాడు. తల్లిని అవమానించిన వ్యక్తి కోసం ఏకంగా పదేళ్ల పాటు వీధులు తిరుగుతూ గాలించాడు. చివరకు ఆ వ్యక్తిని గుర్తించాక 3 నెలల పాటు అతడి దినచర్యను గమనిస్తూ వచ్చి హత్యకు పక్కా ప్రణాళిక సిద్ధం చేశాడు. ఒంటరిగా హత్య చేయడం సాధ్యం కాదని స్నేహితుల సాయం కోరాడు. పనయ్యాక పార్టీ ఇస్తానని ప్రామిస్ చేశాడు. అయితే, ఆ పార్టీ ఫొటోలే వారిని పోలీసులకు పట్టించాయి. ఉత్తరప్రదేశ్ లోని లక్నోలో జరిగిందీ ప్రతీకార హత్య.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లక్నోకు చెందిన సోనూ కశ్యప్ తల్లిని ఓ కొబ్బరి బోండాలు అమ్ముకునే మనోజ్ అనే వ్యక్తి అవమానించాడు. ఏదో విషయంపై మాటామాటా పెరగడంతో మనోజ్ ఆమెపై చేయిచేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోను పగతో రగిలిపోయాడు. అయితే, మనోజ్ ఎవరు, ఎక్కడుంటాడనే విషయం తెలియలేదు. అయినప్పటికీ సోను తన కోపాన్ని, పగను చంపుకోలేదు. తల్లికి జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకోవాలని రగిలిపోయాడు. ఎంతలా అంటే.. ఏళ్ల తరబడి మనోజ్ కోసం గాలించేంతగా. అవును.. ఏకంగా పదేళ్ల పాటు మనోజ్ కోసం సోను లక్నో వీధులన్నీ గాలించాడు.

మూడు నెలల క్రితం మున్షి పులియా ఏరియాలో మనోజ్ ను గుర్తించాడు. ఆపై రోజుల తరబడి మనోజ్ దినచర్యను దగ్గరి నుంచి పరిశీలించి హత్యకు ప్రణాళిక సిద్ధం చేశాడు. ఈ హత్య కోసం సోను తన స్నేహితుల సాయం కోరాడు. పని పూర్తయ్యాక మందు పార్టీ ఇస్తానని ప్రామిస్ చేయడంతో సోను స్నేహితులు రంజీత్, ఆదిల్, సలాము, రహ్మత్ అలీ ఈ హత్యలో పాల్గొన్నారు.

మే 22న రాత్రి మనోజ్ తన కొబ్బరి బోండాల దుకాణం మూసేసి ఇంటికి వెళ్లేందుకు బయలుదేరాడు. ఆ ఏరియా మొత్తం నిర్మానుష్యంగా ఉండడంతో ఇదే అదనుగా భావించిన సోను, అతడి స్నేహితులు ఒక్కసారిగా మనోజ్ పై దాడి చేశారు. ఐరన్ రాడ్డుతో విచక్షణారహితంగా కొట్టడంతో తీవ్ర గాయాలపాలైన మనోజ్ స్పృహ కోల్పోయాడు. మనోజ్ చనిపోయాడని భావించిన సోను బృందం అక్కడి నుంచి వెళ్లిపోయింది. కొనఊపిరితో ఉన్న మనోజ్ ను రోడ్డున పోయేవారు గమనించి ఆసుపత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ మనోజ్ మరణించాడు.

కాగా, ప్రతీకారం తీర్చుకున్న సంతోషంలో సోను తన స్నేహితులకు ఖరీదైన బార్ లో పార్టీ ఇచ్చాడు. మద్యం సేవిస్తూ ఫొటోలు తీసుకున్న సోను, అతడి స్నేహితులు వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ ఫొటోలు వైరల్ గా మారాయి. మరోవైపు, మనోజ్ హత్య పోలీసులకు సవాల్ గా మారింది. ఘటనా స్థలంలో చీకటిగా ఉండడంతో హంతకులు ఎవరనే విషయం కనిపెట్టడం కష్టంగా మారింది. పోలీసులు పట్టు విడవకుండా ప్రయత్నం చేస్తూ సమీపంలోని సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలించారు. ఈ క్రమంలోనే సోను బృందం పార్టీ ఫొటోలు పోలీసుల దృష్టికి వచ్చాయి.

వాటిలో సోను వేసుకున్న దుస్తులు, మనోజ్ హత్య జరిగిన ప్రాంతంలో కనబడిన యువకుడు ధరించిన దుస్తులతో పోలి ఉండడం గుర్తించారు. అనుమానంతో మనోజ్ సోషల్ మీడియా ఖాతాను పరిశీలించగా.. మనోజ్ హత్య సమయంలో ధరించిన దుస్తులతో సోను దిగిన ఫొటోలు కనిపించాయి. దీంతో సోనును అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా మనోజ్ ను హత్య చేసింది తానేనని, తన స్నేహితులు సాయం చేశారని బయటపెట్టాడు. దీంతో సోనుతో పాటు అతడి స్నేహితులను పోలీసులు అరెస్టు చేశారు.


More Telugu News