2040 నాటికి కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రం.. నటేసన్ వ్యాఖ్యలతో రగిలిన రాజకీయ చిచ్చు!

  • ఎస్ఎన్‌డీపీ యోగం జనరల్ సెక్రటరీ నటేసన్ వ్యాఖ్యలతో రాజకీయ దుమారం
  • మలప్పురం ఇప్పటికే ముస్లిం మెజారిటీ జిల్లాగా ఉందని వ్యాఖ్య
  • సీఎం పినరయి విజయన్ సూచనలతోనే ఈ వ్యాఖ్యలు చేశారన్న విపక్షాలు
  • నటేసన్ వ్యాఖ్యలను ‘సిగ్గుమాలిన సామాజిక విభజన వ్యాఖ్యలు’ అన్న ఐయూఎంఎల్
కేరళ రాజకీయాల్లో ప్రస్తుతం 'ముస్లిం మెజారిటీ రాష్ట్రం' వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. కేరళలోని ఈళవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ సామాజిక సేవా సంస్థ శ్రీ నారాయణ ధర్మ పరిపాలన (ఎస్ఎన్‌డీపీ) యోగం జనరల్ సెక్రటరీ వెల్లప్పల్లి నటేసన్ మాట్లాడుతూ 2040 నాటికి కేరళ ముస్లిం మెజారిటీ రాష్ట్రంగా మారుతుందని చేసిన వ్యాఖ్యలు రాష్ట్రంలో ఒక పెద్ద రాజకీయ వివాదానికి తెరతీశాయి.  
 
ఈ నెల 19న కొట్టాయంలో జరిగిన ఎన్ఎన్‌డీపీ యోగం రాష్ట్ర స్థాయి బ్రాంచ్ లీడర్‌షిప్ సమావేశంలో నటేసన్ ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కేరళ త్వరలో ముస్లిం బహుళ రాష్ట్రంగా మారనుందని, మాజీ ముఖ్యమంత్రి వీఎస్ అచ్యుతానందన్ గతంలో ఇలాంటి జనాభా మార్పు గురించి హెచ్చరించారని, ఇది 40 సంవత్సరాలలోపు సంభవిస్తుందని చెప్పారని నటేసన్ గుర్తుచేశారు. ముస్లిం మెజారిటీ జిల్లా అయిన మలప్పురంలో వారి ఆమోదం లేకుండా ఏ ప్రభుత్వ నిర్ణయం అమలు కాదని, రాష్ట్ర ప్రభుత్వం, విపక్ష యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ముస్లిం సామాజికవర్గ ఆసక్తులకు లొంగిపోతున్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం సూచనల మేరకే ద్వేషపూరిత ప్రసంగం
నటేసన్ వ్యాఖ్యలపై విపక్షాలు తీవ్రస్థాయిలో మండిపడ్డాయి. విపక్ష నాయకుడు వీడీ సతీశన్.. నటేసన్ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సూచనల మేరకు చేసినవని ఆరోపించారు. ఈ ద్వేషపూరిత ప్రసంగం సామాజిక సంస్కర్త శ్రీ నారాయణ గురు ఫిలాసఫీకి వ్యతిరేకమని సతీశన్ ధ్వజమెత్తారు. నటేసన్ వ్యాఖ్యలు సమాజంలో విభజన సృష్టించే లక్ష్యంతో ఉన్నాయని ఆరోపించారు.

ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ (ఐయూఎంఎల్) నేషనల్ జనరల్ సెక్రటరీ పీకే కున్హాలికుట్టి మాట్లాడుతూ.. నటేసన్ వ్యాఖ్యలను "సిగ్గుమాలిన సామాజిక విభజన వ్యాఖ్యలు"గా అభివర్ణించారు. "సామాజిక సంస్థలను దుర్వినియోగం చేసి సామాజిక విభజనలను సృష్టించే వ్యక్తులపై చర్యలు తీసుకోవడం ఎల్‌డీఎఫ్ ప్రభుత్వ బాధ్యత" అని ఆయన అన్నారు. సమస్థ కేరళ జెమ్-ఇయ్యతుల్ ఉలమా కూడా నటేసన్ వ్యాఖ్యలను ఖండించింది.


More Telugu News