హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నవ్వులు పూయించిన బ్రహ్మానందం

  • మానవత్వం పరిమళించిన మంచి మనిషి పవన్ కల్యాణ్ అని పేర్కొన్న బ్రహ్మానందం
  • సమాజానికి ఉపయోగపడేలా ఇంకేదో చేయాలని ఇప్పటికీ తపన పడుతూనే ఉంటాడన్న బ్రహ్మానందం
  • లేచిన కెరటం గొప్పది కాదు, పడి లేచిన కెరటం గొప్పదన్న బ్రహ్మానందం
ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం 'హరి హర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో తనదైన శైలిలో నవ్వులు పూయించారు. యాంకర్ సుమ మైక్ అందించినప్పటి నుంచి తన ప్రసంగంతో సభికులను నవ్వించారు. పవన్ కల్యాణ్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. పవన్ కల్యాణ్‌పై ప్రశంసలు కురిపించారు.

బ్రహ్మానందం ప్రసంగిస్తున్నంతసేపు ముఖ్య అతిథి, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సహా సభికులందరూ కడుపుబ్బ నవ్వారు. సుమ రెండు నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చిందని, తాను ఐదు నిమిషాలు మాట్లాడతానని అంటున్నానని, ఇద్దరి మధ్య బేరం కుదరడం లేదని బ్రహ్మానందం చమత్కరించారు.

పవన్ కల్యాణ్ గురించి రెండు నిమిషాలు మాట్లాడే బదులు చాలా థాంక్స్ అని చెప్పి వెళ్లిపోవచ్చని అన్నారు. "వాళ్లు అంతే అంటారు కానీ నేను 15 నిమిషాలు టైం తీసుకుంటా.. నా సంగతి నాకు తెలుసు" అంటూ నవ్వులు పంచుతూనే బ్రహ్మానందం ప్రసంగం కొనసాగించారు.

పవన్ కల్యాణ్ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి, గొప్ప వ్యక్తి అని కొనియాడారు. ఆయన్ను తాను ఎన్నో ఏళ్లుగా చూస్తున్నానని, సమాజానికి ఉపయోగపడేలా ఏదో చేయాలని ఆయన నిరంతరం తపన పడుతూనే ఉంటారని పేర్కొన్నారు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఆయన ఎంచుకున్న మార్గంలోనే నడిచారే తప్ప, ఎవరి దారిలోనూ వెళ్లలేదని అన్నారు.

ఆయన తనతో పాటు మరో పది మందిని నడిపించుకుంటూ వచ్చారని తెలిపారు. పవన్ కల్యాణ్‌ను తనకు తాను చెక్కుకున్న శిల్పిగా అభివర్ణించారు. ఆయన స్వతహాగా నటుడు కాలేదని, అన్నయ్య చిరంజీవి దంపతుల ప్రోత్సాహంతో చిత్ర పరిశ్రమలోకి వచ్చారని అన్నారు. నటనతో ఆగకుండా రాజకీయాల్లోకి వచ్చారని, అది కూడా ఆయన కోరుకోలేదని, విధి అలా నడిపించిందని అన్నారు.

లేచిన కెరటం గొప్పది కాదని, పడి లేచిన కెరటం గొప్పదని బ్రహ్మానందం ఉద్ఘాటించారు. ఎంతమంది ఎన్ని అనుకున్నా, సముద్రంలాంటి సమస్యలు మీదకు వచ్చినా వెనుకడుగు వేయకుండా ఉండగలిగే ఏకైక వ్యక్తి పవన్ కల్యాణ్ అని ప్రశంసించారు. సినిమాలో ఆయన డ్రెస్సింగ్ స్టైల్ గురించి ప్రస్తావిస్తూ, "మీ ఒడిలో తలపెట్టుకుని వెక్కివెక్కి ఏడవాలని ఉంది" అని బ్రహ్మానందం అనడంతో పవన్ కల్యాణ్ నవ్వాపుకోలేక పడిపడి నవ్వారు. 


More Telugu News