సూర్యాపేటలో భారీ దొంగ‌త‌నం.. న‌గ‌ల దుకాణం నుంచి 8 కిలోల బంగారం చోరీ

  • గ్యాస్‌ కట్టర్‌తో ష‌ట్ట‌ర్ కోసేసిన దుండ‌గులు
  • లాక‌ర్ గ‌దిలోని 8 కిలోల బంగారు న‌గ‌లు, రూ. 18ల‌క్ష‌లు చోరీ
  • యూపీకి చెందిన ముఠా ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసుల ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌
సూర్యాపేటలోని ఓ బంగారం దుకాణంలో భారీ చోరీ జ‌రిగింది. దుండ‌గులు పెద్ద‌మొత్తంలో న‌గ‌లు, న‌గ‌దు ఎత్తుకెళ్లారు. సినీఫ‌క్కీలో దొంగ‌త‌నానికి పాల్ప‌డిన దుండ‌గులు రూ. 7కోట్ల విలువైన 8 కిలోల బంగారు ఆభ‌ర‌ణాల‌ను, రూ. 18ల‌క్ష‌ల న‌గ‌దును ఎత్తుకెళ్లారు. 

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. సూర్యాపేట ప‌ట్ట‌ణంలోని స్థానిక మ‌హాత్మాగాంధీ రోడ్డులోని సాయి సంతోషి నగల దుకాణం వెనుక ఉన్న బాత్‌రూం గోడ‌కు రంధ్రం చేసి దొంగ‌లు లోప‌లికి ప్ర‌వేశించారు. లాక‌ర్ గ‌ది ఇనుప ష‌ట్ట‌ర్‌ను త‌మ‌తో పాటు తెచ్చుకున్న‌ గ్యాస్‌ కట్టర్‌తో క‌ట్ చేశారు. అనంత‌రం లాక‌ర్ గ‌దిలోకి ప్ర‌వేశించి అందులోని బంగారు న‌గ‌లు, న‌గ‌దు ఎత్తుకెళ్లారు. 

సోమ‌వారం ఉద‌యం గుర్తించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడ‌న్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదుచేసి ద‌ర్యాప్తు చేస్తున్నామ‌న్నారు. చోరీ జ‌రిగిన ప్రాంతాన్ని ఎస్‌పీ న‌ర‌సింహ‌, సూర్యాపేట డీఎస్‌పీ ప్ర‌సన్న‌కుమార్ ప‌రిశీలించారు. పోలీస్ జాగిలాలు, క్లూస్‌టీంల‌ను ర‌ప్పించి ప్రాథ‌మిక ఆధారాలు, వేలిముద్ర‌ల‌ను సేక‌రించారు. 

యూపీకి చెందిన ఐదుగురు స‌భ్యుల‌తో కూడిన ముఠా ఈ దొంగ‌త‌నానికి పాల్ప‌డిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మిక నిర్ధార‌ణ‌కు వ‌చ్చారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా దొంగ‌ల‌ను గుర్తించేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. దొంగ‌ల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక గాలింపు బృందాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని అధికారులు వెల్ల‌డించారు.


More Telugu News