ప్రియుడితో కలిసి భర్తను చంపి ఇంట్లోనే పాతిపెట్టిన మహిళ!

  • మహారాష్ట్రలో ఘటన
  • వివాహేతర సంబంధం కారణంగా హత్య
  • పోలీసులు అదుపులో భార్య, ప్రియుడు
మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా నలసోపర ప్రాంతంలోని సాయి వెల్ఫేర్ సొసైటీలో సినీ ఫక్కీలో ఓ దారుణ హత్య వెలుగు చూసింది. 28 ఏళ్ల కోమల్ చవాన్ తన భర్త విజయ్ చవాన్‌ను ప్రియుడు మోనుతో కలిసి హత్య చేసి, మృతదేహాన్ని ఇంటి గదిలోని టైల్స్ కింద పాతిపెట్టింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

విజయ్ చవాన్ కొన్ని రోజులుగా కనిపించకపోవడంతో అతని సోదరులు అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం ఉదయం విజయ్ ఇంటికి వచ్చి పరిశీలించగా, ఇంట్లోని కొన్ని టైల్స్ దెబ్బతిని, వాటి రంగు మిగతా వాటికి భిన్నంగా ఉండటం గమనించారు. దీంతో అనుమానం వచ్చి ఆ టైల్స్‌ను తొలగించగా, దుర్వాసనతో పాటు మృతదేహం బయటపడింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, అది విజయ్ చవాన్ మృతదేహమని నిర్ధారించారు.

పోలీసుల ప్రాథమిక విచారణలో కోమల్ చవాన్ నేరాన్ని దాచడానికి వినూత్న పద్ధతిని అనుసరించినట్లు తేలింది. బాత్రూమ్ మరమ్మతులు చేయాల్సి ఉందని, అందుకే టైల్స్ తొలగిస్తున్నట్లు పొరుగువారికి చెప్పి నమ్మబలికింది. కోమల్, విజయ్‌లకు ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. కొంతకాలంగా కోమల్, మోనుల మధ్య అఫైర్ నడుస్తోందని స్థానికులు వెల్లడించారు.

ఈ హత్యలో కోమల్‌తో పాటు ఆమె ప్రియుడు మోను కూడా పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. 'దృశ్యం' సినిమాలో మృతదేహాన్ని దాచిన తీరును అనుకరిస్తూ ఈ నేరం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం పోలీసులు కోమల్, మోనులను అదుపులోకి తీసుకొని విచారణ జరుపుతున్నారు.


More Telugu News