హనీమూన్ హత్య: జైలులో సోనమ్ రఘువంశీని చూసేందుకు రాని కుటుంబ సభ్యులు

  • షిల్లాంగ్ జైలులో ఉన్న సోనమ్ రఘువంశీ
  • పశ్చాత్తాపపడటంలేదన్న జైలు అధికారులు
  • జైలు గదిలో సోనమ్‌తో పాటు ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు
మేఘాలయ హనీమూన్ హత్య కేసులో నిందితురాలు సోనమ్ రఘువంశీని పరామర్శించేందుకు ఆమె కుటుంబ సభ్యులెవరూ రాలేదు. రాజా రఘువంశీ హత్య కేసులో నిందితురాలిగా ఉన్న సోనమ్ గత నెల రోజులుగా షిల్లాంగ్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉంది. అయినప్పటికీ, ఆమెను చూసేందుకు కుటుంబ సభ్యులు ఎవరూ జైలుకు రాకపోవడం గమనార్హం. అంతేకాకుండా, ఆమె తన నేరానికి పశ్చాత్తాపపడటంలేదని జైలు అధికారులు పేర్కొంటున్నారు.

షిల్లాంగ్ జైలులోని వార్డెన్ కార్యాలయానికి సమీపంలో ఉన్న గదిలో సోనమ్‌ను ఉంచారు. ఆమెతో పాటు మరో ఇద్దరు అండర్ ట్రయల్ మహిళా ఖైదీలు కూడా ఉన్నారు. జైల్లో నిబంధనల ప్రకారం, ఆమెకు ఇంకా ఎలాంటి పని అప్పగించలేదని, నిరంతరం సీసీటీవీ కెమెరాల ద్వారా ఆమె కదలికలను పర్యవేక్షిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు.

సోనమ్ జైలు నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటున్నదని, తోటి ఖైదీలతో తన వ్యక్తిగత విషయాలు కానీ, కేసు వివరాలు కానీ పంచుకోవడంలేదని అధికారులు వెల్లడించారు. ఆమెకు ములాఖత్ అవకాశం ఉన్నప్పటికీ, కుటుంబ సభ్యులు ఎవరూ రాలేదని, కనీసం ఫోన్‌లో కూడా ఆమెతో మాట్లాడలేదని జైలు అధికారులు తెలిపారు.

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన రాజా రఘువంశీ, సోనమ్‌ రఘువంశీలు ఈ ఏడాది మే 11న వివాహం చేసుకున్నారు. మే 20న హనీమూన్ కోసం దంపతులు మేఘాలయకు వెళ్లారు. ఆ తర్వాత వీరిద్దరు కనిపించకుండా పోయారు. 11 రోజుల తర్వాత రఘువంశీ మృతదేహాన్ని ఓ జలపాతంలో గుర్తించారు. సోనమ్ కోసం పోలీసులు గాలించగా, జూన్ 7న ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఆమె ప్రత్యక్షమైంది. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.


More Telugu News