హైకోర్టు జడ్జిని ‘వర్మ’ అంటున్నారు ఆయన మీ స్నేహితుడా?.. లాయర్ పై సీజేఐ సీరియస్
- ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తిని ఏకవచనంలో సంబోధించడంపై ఆగ్రహం
- ఆయన ఇప్పటికీ జడ్జిగానే ఉన్నారని గుర్తుచేసిన సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్
- అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన జడ్జి స్థానానికి అనర్హుడన్న లాయర్
- న్యాయ సూత్రాల గురించి ధర్మాసనానికి చెప్పొద్దంటూ సీజేఐ హెచ్చరిక
‘జస్టిస్ యశ్వంత్ వర్మను, వర్మ అని సంబోధిస్తున్నారు.. ఆయన మీ స్నేహితుడా’ అని సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. జస్టిస్ వర్మ ఇప్పటికీ న్యాయమూర్తేనని గుర్తుచేశారు. ఓ హైకోర్టు న్యాయమూర్తిని ఎలా సంబోధించాలో తెలియదా అంటూ సీరియస్ అయ్యారు. దీంతో న్యాయవాది మాథ్యూస్ నెడుంపర స్పందిస్తూ.. జస్టిస్ యశ్వంత్ వర్మ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు. ఈ ఆరోపణల కారణంగా న్యాయమూర్తి స్థానానికి ఆయన సరితూగరని అన్నారు. ఈ వివరణతో సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ మరింత సీరియస్ గా స్పందించారు. తమకు న్యాయ సూత్రాలు బోధించే ప్రయత్నం చేయొద్దని హెచ్చరించారు.