పిట్‌బుల్ దాడిచేస్తుంటే రక్షించడం మాని నవ్వుతూ చూస్తున్న వ్యక్తి.. వీడియోలు తీసుకున్న జనం!

  • మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఘటన
  • ఆటోలో ఆడుకుంటున్న పిల్లలపైకి కుక్కను వదిలిన యజమాని
  • ఆటోలో చిక్కుకుపోయిన బాలుడిపై పిట్‌బుల్ దాడిచేస్తుంటే నవ్వుతూ కూర్చున్న యజమాని
  • బాలుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి పోలీసులు
  • పరారీలో పిట్‌బుల్ యజమాని
ముంబైలో ఓ ఆటోలో 11 ఏళ్ల బాలుడిని పిట్‌బుల్ (శునకం)తో భయటపెట్టిన ఘటనలో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆటోలో ఉన్న బాలుడు శునకాన్ని చూసి భయపడి ఏడుస్తుంటే అది మరింతగా అతడిని భయపెట్టింది. దాడిచేసేందుకు ప్రయత్నించింది. ఏడుస్తున్న బాలుడిని చూసిన ఆటోలో ఉన్న యజమానితోపాటు ఇతరులు అతడిని శునకం బారి నుంచి రక్షించడం మాని నవ్వుతూ వీడియోలు తీస్తూ కూర్చున్నాడు. ఈ నెల 17 మంఖుర్ద్‌లో జరిగిందీ ఘటన. బాలుడు తన స్నేహితులతో ఆటో రిక్షాలో ఆడుకుంటుండగా పిట్ బుల్‌ను చూసి ఉత్సాహంగా కేకలేశాడు.

ఆ వెంటనే శునకం యజమాని సోహైల్ ఖాన్ పిట్‌బుల్‌తో ఆటో ఎక్కాడు. దీంతో పిల్లలందరూ భయపడి పారిపోయారు. అయితే, బాధిత బాలుడు మాత్రం తప్పించుకోలేకపోయాడు. ఆ తర్వాత కుక్కను వదిలి బాలుడిని భయపెట్టాడు. బాలుడు భయంతో ఏడుస్తూ శునకం బారి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఆటో నుంచి దూకి పరిగెత్తాడు. శునకం అతడిని వెంబడించి పలుచోట్ల కరిచింది. 

బాలుడు ఏడుస్తుంటే శునకం యజమాని కానీ, దానిని చూస్తున్న ఇతరులు కానీ రక్షించే ప్రయత్నం చేయకుండా నవ్వుతూ వీడియో తీస్తుండటం వైరల్ అయిన వీడియోలో కనిపిస్తోంది. ఈ ఘటనపై బాలుడి తండ్రి మంఖుర్ద్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. శునకం యజమాని సోహైల్ ఖాన్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. 


More Telugu News