ఆదిత్య ఫార్మ‌సీ ఎండీ ఆత్మ‌హ‌త్య కేసులో కీల‌క మ‌లుపు

  • ఈ నెల 5న ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు
  • శివాజీ, ప‌రంధామ‌య్య ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మని మృతుడి భార్య పోలీసుల‌కు ఫిర్యాదు
  • తీసుకున్న అప్పు తీర్చాలంటూ ప‌లుమార్లు ఫోన్లు చేసి వేధింపులు
  • ఈ మేర‌కు పోలీసుల‌కు ఫిర్యాదు.. సాంకేతిక ఆధారాలు సేక‌రించే పనిలో పోలీసులు
ఆదిత్య ఫార్మసీ ఎండీ నరసింహమూర్తి రాజు ఈ నెల 5న విజ‌య‌వాడ‌లోని అయోధ్య‌న‌గ‌ర్‌లో ఉరేసుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డిన‌ విషయం తెలిసిందే. అయితే, ఈ ఆత్మ‌హ‌త్య కేసులో తాజాగా కీల‌క మ‌లుపు చోటు చేసుకుంది. విశాఖ‌కు చెందిన బుద్ధంరాజు శివాజీ, విజ‌య‌వాడ‌కు చెందిన పిన్న‌మ‌నేని ప‌రంధామ‌య్య ఆయ‌న ఆత్మ‌హ‌త్య‌కు కార‌ణ‌మంటూ మృతుడి భార్య శాంతి పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. తీసుకున్న అప్పు తీర్చాలంటూ ప‌లుమార్లు ఫోన్లు చేసి వేధించార‌ని ఆమె త‌న ఫిర్యాదులో పేర్కొన్నారు. 

త‌న భ‌ర్తకు ఫోన్ చేసి బెదిరింపుల‌కు పాల్ప‌డ‌డంతోనే ఆయ‌న క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్నార‌ని ఆమె చెప్ప‌డంతో పోలీసులు అందులో నిజానిజాలు తెలుసుకునేందుకు సాంకేతిక ఆధారాలు సేక‌రించే ప‌నిలో ప‌డ్డారు. శివాజీ, ప‌రంధామ‌య్య‌... నరసింహమూర్తి రాజును బెదిరించారా? ఎన్నిసార్లు ఫోన్ చేశారు? త‌దిత‌ర విష‌యాలు తెలుసుకునేందుకు ఫోన్ కాల్ డేటా సేక‌రించి విశ్లేషిస్తున్నారు. 

ఆయా వివ‌రాలు బ‌య‌ట‌కు వ‌స్తే.. నిజానిజాలు తెలుస్తాయ‌ని పోలీసులు చెబుతున్నారు. కాగా, నరసింహమూర్తి రాజు  ఆత్మ‌హ‌త్య త‌ర్వాత నుంచి వారిద్ద‌రూ క‌నిపించ‌కుండా పోయారు. దాంతో పోలీసులు వారి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. శివాజీ, ప‌రంధామ‌య్య‌ల‌ను ప‌ట్టుకునేందుకు ప్ర‌త్యేక పోలీసు బృందాలు గాలిస్తున్నాయి. నిందితులిద్ద‌రిపై బీఎన్ఎస్ 306 సెక్ష‌న్ కింద కేసు న‌మోదు చేశారు.     
 


More Telugu News