ట్రంప్ 'జెట్' వ్యాఖ్యలు: రాహుల్ గాంధీ ప్రశ్నపై తీవ్రంగా స్పందించిన బీజేపీ

  • ఆపరేషన్ సిందూర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు
  • దేశం నిజం తెలుసుకోవాలనుకుంటోందన్న రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీకి భారత్ కంటే పాక్ అంటేనే మక్కువ అని అమిత్ మాలవీయ విమర్శ
  • పాకిస్థాన్ అధికార ప్రతినిధిలా మాట్లాడుతున్నారని మండిపాటు
ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదు జెట్లు కూలిపోయాయంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు దేశ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి. భారత్-పాక్ మధ్య యుద్ధం ఆగిపోవడానికి తానే కారణమన ట్రంప్ గతంలో పలుమార్లు పేర్కొన్న విషయం తెలిసిందే. తాజాగా ఆపరేషన్ సిందూర్ సమయంలో ఐదు జెట్లు కూలిపోయాయని చెబుతూ మరోసారి యుద్ధం నిలిచిపోవడానికి తన కృషి ఉందని చెప్పే ప్రయత్నం చేశారు.

ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. "మోదీ గారూ, ట్రంప్ చెబుతున్న ఐదు జెట్ల వెనుక ఉన్న నిజం ఏమిటి? దేశం తెలుసుకోవాలనుకుంటోంది" అని ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.

రాహుల్ గాంధీ ట్వీట్‌కు బీజేపీ నేత అమిత్ మాలవీయ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. ట్రంప్ ఏ దేశానికి చెందిన జెట్లు కూలాయనే విషయాన్ని స్పష్టంగా చెప్పలేదని ఆయన గుర్తు చేశారు. అయితే రాహుల్ గాంధీ మాత్రం పాకిస్థాన్ అధికార ప్రతినిధిలా ప్రశ్నిస్తున్నారని మండిపడ్డారు.

రాహుల్ గాంధీది దేశద్రోహ మనస్తత్వమని అమిత్ మాలవీయ విమర్శించారు. జెట్ విమానాలు కూలాయని ట్రంప్ చెప్పినా, అవి ఏ దేశానికి చెందినవో వెల్లడించలేదని ఆయన అన్నారు. కాంగ్రెస్ యువరాజు తనను తాను పాకిస్థాన్‌కు చెందినవాడిగా అంగీకరించాలని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీకి తన దేశం కంటే పాకిస్థాన్‌పైనే ఎక్కువ మక్కువ ఉందని ఆయన ఆరోపించారు.

పాకిస్థాన్ ఇప్పటికీ ఆపరేషన్ సిందూర్ దెబ్బ నుంచి కోలుకోలేదని, అందుకే రాహుల్ గాంధీ బాధపడుతున్నారని అమిత్ మాలవీయ అన్నారు. మన దేశ సైన్యం పాకిస్థాన్‌‌కు తగిన గుణపాఠం చెప్పిన ప్రతి సందర్భంలోనూ కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడుతుందని ఆయన విమర్శించారు. భారత వ్యతిరేక భావన ఆ పార్టీకి గుర్తింపుగా మారిందని ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ భారతీయుడో లేక పాకిస్థాన్‌కు చెందిన వారో స్పష్టంగా చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.


More Telugu News