పుణేలో అజారుద్దీన్ మాజీ భార్య ఫాంహౌస్ ధ్వంసం

  • పుణేలో నటి సంగీతా బిజ్లానీకి ఫాంహౌస్
  • తండ్రికి అనారోగ్యంగా ఉండడంతో నాలుగు నెలలుగా ఫాంహౌస్ కు దూరం
  • నిన్న ఫాంహౌస్ కు వెళ్లిన సంగీతా... ధ్వంసమైన స్థితిలో కనిపించిన ఫాంహౌస్
  • పోలీసులకు ఫిర్యాదు
క్రికెట్ దిగ్గజం మహ్మద్ అజారుద్దీన్ మాజీ భార్య, బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీకి చెందిన ఫాంహౌస్ ధ్వంసమైంది. మహారాష్ట్రలోని పుణే సమీపంలోని టికోనా గ్రామంలో సంగీతా బిజ్లానీకి ఫాంహౌస్ ఉంది. ఈ నెల 18న ఆమె తన ఇద్దరు సహాయకులతో కలిసి ఫాంహౌస్‌ను సందర్శించినప్పుడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. 

మెయిన్ గేటు, కిటికీల గ్రిల్స్ విరిగిపోయిన స్థితిలో కనిపించాయి. రూ.7 వేల విలువైన ఒక టీవీ చోరీకి గురైంది. అంతేకాక, మరో టీవీ, బెడ్‌లు, రిఫ్రిజిరేటర్, సీసీటీవీ కెమెరాలు ధ్వంసం అయ్యాయి. ఫాంహౌస్ లో ఉన్న ఇంటిలో ఎగువ అంతస్తు పూర్తిగా దెబ్బతింది. ఇంట్లోని గృహోపకరణాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. 

తన తండ్రి ఆరోగ్య సమస్యల కారణంగా నాలుగు నెలలుగా ఫాంహౌస్‌ను సందర్శించలేదని సంగీతా బిజ్లానీ తెలిపారు. ఇప్పుడు వచ్చి చూసేసరికి అంతా ధ్వంసమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఆమె పుణే రూరల్ ఎస్పీ సందీప్ సింగ్ గిల్‌కు ఫిర్యాదు చేశారు. రూ.50 వేల నగదు కూడా చోరీకి గురైనట్టు భావిస్తున్నారు.

పూనావాలా పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ దినేష్ తాయడే ప్రకారం, నష్టం మరియు చోరీ వివరాలను అంచనా వేసిన తర్వాత ఎఫ్‌ఐఆర్ నమోదు చేయనున్నారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించాలని నిర్ణయించారు. 


More Telugu News