ఆ సంస్థను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా... స్పందించిన శశిథరూర్

  • 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను ఉగ్రవాద సంస్థగా ప్రకటించిన అమెరికా
  • 'ఎక్స్' వేదికగా స్పందించిన శశిథరూర్
  • పాక్ పట్ల ఉదాసీనతను తాను ప్రశ్నించానన్న శశిథరూర్
  • అమెరికా చర్యను స్వాగతించిన కాంగ్రెస్ నేత
ఉగ్రవాద సంస్థలకు ఆశ్రయం కల్పిస్తున్న పాకిస్థాన్ పట్ల అమెరికా ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తోందని తాను అక్కడి అధికారులను ప్రశ్నించానని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్ అన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి కారణమైన 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్'ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది. ఈ నేపథ్యంలో శశిథరూర్ 'ఎక్స్' వేదికగా స్పందించారు.

ఆపరేషన్ సిందూర్ తర్వాత అఖిలపక్ష పర్యటనలో భాగంగా శశిథరూర్ అమెరికా వెళ్లారు. ఈ సందర్భంగా అక్కడి అధికారులతో జరిగిన సంభాషణల గురించి ఆయన సామాజిక మాధ్యమం ద్వారా పంచుకున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అమెరికాతో కలిసి పనిచేస్తున్నామని పాకిస్థాన్ చెప్పిన విషయాన్ని అక్కడి అధికారుల వద్ద ప్రస్తావించినట్లు తెలిపారు.

అయితే ఉగ్రవాదం పట్ల పాకిస్థాన్ ఎంత చిత్తశుద్ధితో ఉందో భారత్‌కు తెలుసని వారితో చెప్పినట్లు వెల్లడించారు. భారత్‌కు ఎదురైన అనుభవాలను వారికి తెలియజేశామని అన్నారు.

'ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌'ను అమెరికా ఉగ్రవాద సంస్థగా ప్రకటించడంపై కూడా శశిథరూర్ స్పందించారు. అమెరికా చర్య ఇరుదేశాల మధ్య ఉన్న పలు అభిప్రాయభేదాల తొలగింపునకు తొలి అడుగుగా భావిస్తున్నామని అన్నారు. ఐక్యరాజ్యసమితిలో టీఆర్ఎఫ్‌ను ఉగ్రసంస్థగా ప్రకటించేందుకు భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.


More Telugu News