మాజీ క్రికెటర్ అజారుద్దీన్ లోనావాలా బంగ్లాలో దొంగ‌త‌నం

  • అజారుద్దీన్ భార్య సంగీత బిజ్లానీ యాజమాన్యంలోని లోనావాలా బంగ్లాలో చోరీ
  • రూ.50వేల‌ నగదు, దాదాపు రూ.7,000 విలువైన టీవీ సెట్‌ను ఎత్తుకెళ్లిన దొంగ‌లు
  • దొంగతనంతో పాటు ఇంట్లోని సామాగ్రిని కూడా ధ్వంసం చేసిన దుండ‌గులు
భారత మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్ భార్య సంగీత బిజ్లానీ యాజమాన్యంలోని లోనావాలా బంగ్లాలో చోరీ జ‌రిగింది. 2025 మార్చి 7, జూలై 18 మధ్య పుణె జిల్లాలోని మావల్ తాలూకాలోని టికోనా పేత్‌లోని వారి బంగ్లాలో దొంగతనం జరిగిందని పుణె గ్రామీణ పోలీసు ఉన్నతాధికారి శనివారం తెలిపారు.

పోలీసుల కథనం ప్రకారం, గుర్తు తెలియని దుండగులు బంగ్లా వెనుక కాంపౌండ్ గోడ వైర్ మెష్‌ను తొల‌గించి లోపలికి చొరబడ్డారు. ఆ తర్వాత వారు మొదటి అంతస్తు గ్యాలరీకి ఎక్కి, కిటికీ గ్రిల్‌ను బలవంతంగా తెరిచి, బంగ్లాలోకి ప్రవేశించారు.

దొంగలు రూ.50,000 నగదు, దాదాపు రూ.7,000 విలువైన టెలివిజన్ సెట్‌ను దొంగిలించారు. దీంతో మొత్తం రూ.57,000 నష్టం వాటిల్లిందని అంచనా. దొంగతనంతో పాటు దుండ‌గులు ఇంటిలోని సామాగ్రిని కూడా ధ్వంసం చేశారు.

అజారుద్దీన్ వ్యక్తిగత సహాయకుడు మహ్మద్ ముజీబ్ ఖాన్ ఈ మేర‌కు ఫిర్యాదు దాఖలు చేసిన‌ట్లు పోలీసులు వెల్ల‌డించారు. శంభాజీనగర్ నివాసి అయిన ఖాన్.. మార్చి 7 మరియు జులై 18 మధ్య బంగ్లాలో ఎవ‌రులేని సమయంలో ఈ దొంగతనం జరిగి ఉండవచ్చని పేర్కొన్నారు.

ఆయ‌న ఫిర్యాదు మేరకు లోనావాలా గ్రామీణ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తులపై బీఎన్ఎస్ సెక్షన్లు 331(3), 331(4), 305(a), 324(4), 324(5) కింద కేసు నమోదు చేశారు. ప్ర‌స్తుతం ద‌ర్యాప్తు కొన‌సాగుతోంది. ఇందులో భాగంగా నిందితులను గుర్తించడానికి సీసీటీవీ ఫుటేజ్‌ను ప‌రిశీలిస్తున్నారు.


More Telugu News