మరాఠీని అర్థం చేసుకోలేకపోతే చెంప దెబ్బలు తప్పవు.. స్థానికేతరులను హెచ్చరించిన రాజ్ థాకరే

  • చెవిలో చెప్పినా అర్థం చేసుకోకపోతే దాని కిందే దెబ్బలు పడతాయన్న రాజ్ థాకరే
  • పనిచేసుకోవడానికి వచ్చిన వారు గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకోవాలని సూచన
  • స్కూళ్లలో హిందీని తప్పనిసరి చేస్తే మూసివేస్తామని ప్రభుత్వానికి హెచ్చరిక
మహారాష్ట్రలోని స్థానికేతరులను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్‌థాకరే తీవ్రస్థాయిలో హెచ్చరించారు. మరాఠీని అర్థం చేసుకోకుంటే చెంప దెబ్బలు తప్పవని హెచ్చరికలు జారీచేశారు. ‘ఇప్పుడు మరాఠీని మీ చెవిలో చెప్పినా అర్థం చేసుకోలేకపోతే, దాని కిందే మీకు దెబ్బ తగులుతుంది, ఎలాంటి కారణం లేకుండానే ప్రజలు గొడవ సృష్టిస్తారు’ అని రాజ్‌థాకరే చెప్పుకొచ్చారు. ముంబైలోని మీరా- భయందర్‌లో జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు. మరాఠీలో మాట్లాడనందుకు ఇటీవల ఎంఎన్ఎస్ కార్యకర్తలు కొందరు ఒక దుకాణ యజమానిపై దాడిచేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై వ్యాపారులు ఆందోళనకు దిగారు. 

రాజ్ థాకరే ఈ ఘటనను గుర్తుచేసుకుంటూ.. అతడి (దుకాణదారు) వైఖరి వల్లే అలా జరిగిందని పేర్కొన్నారు. ఈ కారణంగా షాపులు మూసుకున్న వారు ఒక విషయాన్ని గ్రహించాలని, ఎంతకాలం షాపులు మూసుకోగలరని పేర్కొన్నారు. తాము కొనడం మానేస్తే అప్పుడు మీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ఇక్కడికొచ్చిన వారందరూ (స్థానికేతరులు) గుట్టుచప్పుడు కాకుండా పనిచేసుకుంటూ పోవాలని, తెలివి తక్కువగా ప్రవర్తిస్తే చెంప దెబ్బ తప్పదని హెచ్చరించారు. 

అలాగే, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ పైనా రాజ్‌థాకరే నిప్పులు చెరిగారు. ఒకటో తరగతి నుంచి ఐదు వరకు హిందీని తప్పనిసరి చేస్తే స్కూళ్లను తమ పార్టీ మూసి వేస్తుందని స్పష్టం చేశారు. తాము ఏ భాషకూ వ్యతిరేకం కాదని, అయితే తప్పనిసరి చేస్తే మాత్రం సహించబోమని తేల్చి చెప్పారు. 


More Telugu News