అన్న ఇంటికే కన్నం వేసిన చెల్లి... ఎందుకంటే...!

  • అన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బులు పోగొట్టుకున్న అక్క ఆమని 
  • అప్పులు తీర్చుకునేందుకు అన్న శ్రీకాంత్ ఇంట్లో చోరీకి ప్లాన్
  • అన్న ఇంటి తాళం చెవి స్నేహితులకు ఇచ్చి చోరీ చేయించిన ఆమని 
  • హైదరాబాద్‌‌లోని గాజుల రామారంలో వెలుగుచూసిన ఘటన 
చెడు వ్యసనాలకు అలవాటుపడిన ఓ యువతి, తన అప్పులు తీర్చుకునేందుకు తెలివిగా పథకం వేసి అన్న ఇంట్లోనే బంగారం, నగదు చోరీ చేసింది. అయితే, పోలీసులు రంగంలోకి దిగడంతో ఆమె దొరికిపోయింది. ఈ ఘటన హైదరాబాద్‌లోని గాజులరామారంలోని షిరిడీ హిల్స్‌లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. వేముల శ్రీకాంత్ అనే వ్యక్తి తన భార్య, పిల్లలతో కలిసి షిరిడీ హిల్స్‌లో నివాసం ఉంటున్నాడు. అతని తల్లిదండ్రులు కర్మన్‌ఘాట్‌లో ఉంటున్నారు. శ్రీకాంత్ చెల్లెలు ఆమని వివాహం చాలాకాలం క్రితమే జరిగినా, భర్తతో విభేదాల కారణంగా గత 8 సంవత్సరాలుగా తల్లిదండ్రుల వద్దనే ఉంటోంది. ఈ క్రమంలో ఆమె ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు బానిసైంది. ఈ వ్యసనం వల్ల దాదాపు రూ.5 లక్షలు నష్టపోయింది. అంతేకాకుండా పలువురి వద్ద అప్పులు కూడా చేసింది.

ఈ సమయంలో, అన్న శ్రీకాంత్ కొత్త కారు పూజ కోసం కుటుంబ సభ్యులతో కలిసి కర్మన్‌ఘాట్‌కు వెళ్ళాడు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న శ్రీకాంత్ చెల్లెలు ఆమని, అన్న ఇంట్లో చోరీకి పథకం రచించింది. అన్న, వదిన తల్లిదండ్రుల ఇంటికి వచ్చిన రోజే వారి ఇంటి తాళం చెవిని తెలివిగా కొట్టేసింది. అర్ధరాత్రి సమయంలో ఆమని తన స్నేహితులు కార్తీక్, అఖిల్‌లను పిలిచి వారికి ఆ తాళం చెవిని ఇచ్చి, గాజుల రామారంలోని అన్న శ్రీకాంత్ ఇంట్లో చోరీ చేయాలని చెప్పింది.

దీంతో వారు ఇద్దరూ శ్రీకాంత్ ఇంటికి వెళ్ళి ఇంట్లో ఉన్న డబ్బు, 12 తులాల బంగారు ఆభరణాలు చోరీ చేసుకుని తిరిగి వచ్చారు. తాళం చెవిని ఆమనికి అప్పగించారు. అయితే ఇంటికి తిరిగి వెళ్ళిన శ్రీకాంత్, చోరీ జరిగినట్లు గుర్తించాడు. వెంటనే జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. వేసిన తాళాలు వేసినట్లే ఉండి, డబ్బు, బంగారం మాయమవ్వడంపై పోలీసులకు అనుమానం కలిగింది.

ఇది ఇంటి దొంగల పనే అయి ఉంటుందని అనుమానించారు. అక్కడ సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి నిర్ధారణకు వచ్చారు. ఆమని బెట్టింగ్ వ్యవహారం తెలియడంతో ఆమెను అదుపులోకి తీసుకుని పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో అసలు విషయం బయటపడింది. చోరీ చేసిన కొంత బంగారాన్ని గోల్డ్ లోన్ కంపెనీ వారి వద్ద తనఖా పెట్టి ఆమె డబ్బులు తీసుకున్నట్లు తెలుసుకున్నారు. నిందితులు చోరీకి ఉపయోగించిన సుత్తి, ఇనుప రాడ్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీ కేసులో ఆమనితో పాటు ఆమె స్నేహితులు ఇద్దరినీ పోలీసులు అరెస్టు చేశారు. 


More Telugu News