మీ తెలుగు యాడ్ నాకు బాగా నచ్చింది సర్: ఆనంద్ మహీంద్రా ట్వీట్ పై నారా లోకేశ్ స్పందన

  • ఫ్యూరియో-8 ట్రక్కులు ప్రవేశపెట్టిన మహీంద్రా గ్రూప్
  • తాజాగా తెలుగులోనూ యాడ్
  • ఆనంద్ మహీంద్రా తెలుగు ట్వీట్ ను పంచుకున్న ఏపీ మంత్రి నారా లోకేశ్
  • ఏపీలో పరిశ్రమ స్థాపించాలంటూ మహీంద్రాకు ఆహ్వానం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ మరియు మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేశ్, ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా సరికొత్త యాడ్ పై స్పందించారు. మహీంద్రా సంస్థ తాజాగా మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఫ్యూరియో-8 ట్రక్కులకు సంబంధించిన ఆ యాడ్ తనకు బాగా నచ్చిందని లోకేశ్ వెల్లడించారు. అంతేకాదు, ఆ యాడ్ అందరినీ ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. 

ఈ సందర్భంగా ఏపీలో ఉత్పాదన కర్మాగారం ఏర్పాటు చేయాలని మహీంద్రా సంస్థకు ఆహ్వానం పలికారు. రాష్ట్రంలోని అభివృద్ధి చెందిన ఆటోమోటివ్ ఇకోసిస్టమ్ మరియు విస్తారమైన మార్కెట్‌ను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. 

ఇవాళ మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తెలుగులో చేసిన ట్వీట్ ను లోకేశ్ పంచుకున్నారు. "మీ తెలుగు యాడ్ చాలా బాగుంది సర్. ఆంధ్రప్రదేశ్ మీ వాహనాలకు పెద్ద మార్కెట్. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవడానికి రాష్ట్రంలో మహీంద్రా ఉత్పాదన కర్మాగారం ఏర్పాటు చేయండి. మా రాష్ట్రంలోని అపార అవకాశాలను పరిచయం చేయడానికి మీ బృందాన్ని ఆహ్వానిస్తున్నాం" అని లోకేశ్ పేర్కొన్నారు. 

ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు అనుకూల వాతావరణం, అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు మరియు నైపుణ్యం కలిగిన మానవ వనరులను హైలైట్ చేస్తూ, రాష్ట్రం ఆటోమొబైల్ రంగంలో పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా ఉందని మంత్రి లోకేశ్ తెలిపారు. ఈ ప్రతిపాదనపై మహీంద్రా సంస్థ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా ఉంది.


More Telugu News