కేంద్రం నుంచి రూ. 46,715 సాయం అంటూ సందేశం వచ్చిందా? అది సైబర్ నేరగాళ్ల పనే.. జాగ్రత్త!

  • కేంద్ర ప్రభుత్వం నుంచి సాయం అంటూ వాట్సాప్ సందేశం వస్తే జాగ్రత్తగా ఉండాలన్న కేంద్రం
  • ఇలాంటి సందేశాలతో మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తారని హెచ్చరిక
  • సైబర్ నేరగాళ్ల మాయలో పడవద్దని సూచన
కేంద్ర ప్రభుత్వం నుంచి రూ. 46,715 సాయం పొందవచ్చని మీకు వాట్సాప్ సందేశం వచ్చిందా? అయితే జాగ్రత్త వహించండి! ఇటువంటి సందేశాలను సైబర్ నేరగాళ్లు పంపి మీ బ్యాంకు ఖాతాలను ఖాళీ చేసే అవకాశం ఉంది. ఇలాంటి సందేశం వచ్చి, వారు పంపిన లింక్‌పై క్లిక్ చేసి మీ వ్యక్తిగత వివరాలను షేర్ చేస్తే మీ ఖాతాలోని సొమ్ము ఖాళీ అవుతుంది.

ఖండించిన కేంద్ర ప్రభుత్వం

ప్రజలు ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటుండటంతో ఆ తీవ్రతను తగ్గించేందుకు ప్రతి పౌరుడికీ రూ. 46,715 సాయంగా ఇవ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ నిర్ణయించిందని, రిజిస్టర్ చేసుకోవాలంటూ వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోందని, కానీ ఇందులో వాస్తవం లేదని కేంద్రం ఖండించింది.

ఇది ఒక కుంభకోణమని, అలాంటి పథకాన్ని దేనినీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పీఐబీ ఫ్యాక్ట్ చెక్ విభాగం 'ఎక్స్'లో పోస్టు చేసింది. ఇలాంటి లింకులు వస్తే క్లిక్ చేయవద్దని, ఎవరికీ షేర్ చేయవద్దని హెచ్చరించింది. సైబర్ నేరగాళ్ల మాయలో పడవద్దని సూచించింది.


More Telugu News