క‌ర్ణాట‌క సీఎంకు సారీ చెప్పిన‌ మెటా.. కార‌ణ‌మిదే!

  • సీనియ‌ర్ న‌టి స‌రోజాదేవి మృతిప‌ట్ల సంతాపం తెలుపుతూ క‌ర్ణాట‌క సీఎంఓ పోస్టు
  • ఆ పోస్టును క‌న్న‌డ నుంచి ఆంగ్లంలోకి త‌ప్పుగా అనువాదం చేసిన మెటా
  • ఈ విష‌య‌మై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన సీఎం సిద్ధ‌రామ‌య్య‌
  • తాజాగా స్పందిస్తూ ముఖ్య‌మంత్రికి క్ష‌మాప‌ణ చెప్పిన మెటా సంస్థ‌
క‌ర్ణాట‌క సీఎం సిద్ధ‌రామ‌య్యకు మెటా సంస్థ సారీ చెప్పింది. ఒక పోస్టును క‌న్న‌డ నుంచి ఆంగ్లంలోకి త‌ప్పుగా అనువాదం చేయ‌డం ప‌ట్ల మెటాపై ఆయ‌న‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన విష‌యం తెలిసిందే. దీంతో తాజాగా ఆ సంస్థ స్పందించింది. క‌న్న‌డ అనువాదం స‌రిగా లేద‌నే స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని మెటా ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు. 

ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రిని క్ష‌మాప‌ణ‌లు కోరుతున్నామ‌న్నారు. అనువాదంలో ఏఐ టూల్ మిష‌న్ త‌ప్పిదం వ‌ల్ల ఇలా జ‌రిగింద‌ని సంస్థ ఫేస్‌బుక్‌లో పేర్కొంది. క‌చ్చిత‌మైన అనువాదాన్ని అందించేందుకు కృషి చేస్తామ‌ని తెలిపింది. ఏఐ సాంకేతిక‌త‌ను మెరుగుప‌ర‌చుకునే ప్రాసెస్‌లో ఉన్నామ‌ని, ఇందులో భాగంగానే త‌ప్పిదం జ‌రిగింద‌ని మెటా వివ‌రించింది. 

అస‌లేం జ‌రిగిందంటే..!
ఇటీవ‌ల సీనియ‌ర్ న‌టి స‌రోజాదేవి క‌న్నుమూసిన విష‌యం తెలిసిందే. దీంతో ఆమెకు సంతాపం తెలుపుతూ క‌ర్ణాట‌క సీఎంఓ క‌న్న‌డ‌లో ఓ పోస్టు పెట్టింది. సీఎం సిద్ధ‌రామ‌య్య బ‌హుభాషా తార, సీనియ‌ర్ న‌టి బి. స‌రోజాదేవి పార్థీవ‌దేహానికి క‌డ‌సారి నివాళుల‌ర్పించార‌ని అందులో పేర్కొంది. దీన్ని మెటా సంస్థ ఆంగ్లంలో త‌ప్పుగా అనువ‌దించింది. ఈ విష‌య‌మై ముఖ్య‌మంత్రి స్పందిస్తూ.. ఆ సంస్థ‌పై ఫైర్ అయ్యారు. ఇలాంటివి చాలా ప్ర‌మాద‌క‌ర‌మ‌ని సిద్ధ‌రామ‌య్య ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మెటా కంపెనీ స్పందిస్తూ సీఎంకు సారీ చెప్పింది.      


More Telugu News