కసి కసి స్టెప్పులతో పూజానే కంగారు పెట్టేశాడే!

  • మలయాళంలో సౌబిన్ కి మంచి ఇమేజ్ 
  • 'కూలీ'లో కీలకమైన రోల్ చేసిన సౌబిన్ 
  • రీసెంటుగా వదిలిన 'మోనికా' సాంగ్ 
  • పూజా మెరుపులతో పోటీపడిన నటుడు 
  • సినిమాపై ఆసక్తిని పెంచిన సాంగ్

తెలుగులో ఎన్టీఆర్ .. బన్నీ .. రామ్ వంటి హీరోలు డాన్సులు అదరగొట్టేస్తారనే విషయం అందరికీ తెలుసు. అలాగే తమిళంలో విజయ్ .. అజిత్ ఇద్దరూ కూడా డాన్సులు కుమ్మేస్తారు. అలాంటి హీరోల నుంచి అవి ఆశించే స్టెప్పులే గనుక అంతగా ఆశ్చర్యపోరు. కానీ తెరపై కొన్ని పాత్రలలో కాస్త అమాయకంగా .. మొద్దబ్బాయి మాదిరిగా కనిపించే సౌబిన్ షాహిర్ డాన్స్ ఇరగదీసేస్తాడని ఎవరూ అనుకోరు. అందుకే 'మోనికా' సాంగులో ఇప్పుడు ఆయన స్టెప్పులు హుషారెత్తిస్తున్నాయి. 

రజనీకాంత్ - లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో 'కూలీ' సినిమా రూపొందింది. ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో రీసెంట్ గా ఈ సినిమా నుంచి 'మోనికా మై డియర్ మోనికా' అనే లిరికల్ వీడియో సాంగ్ ను వదిలారు. అనిరుధ్ స్వరపరిచిన ఈ పాటకి, శాండీ కొరియోగ్రఫీని సమకూర్చాడు. పూజ హెగ్డే .. సౌబిన్ .. ఇతర బృందంపై ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటలో సౌబిన్ వేసిన హుషారైన స్టెప్పులు ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి. 

సౌబిన్ మలయాళ ఇండస్ట్రీకి చెందిన నటుడు. సినిమా నేపథ్యం కలిగిన కుటుంబం నుంచి వచ్చినవాడే. అయితే డైరెక్టర్ కావడం కోసం ట్రై చేసే క్రమంలోనే నటుడిగా మారిపోయాడు. ప్రేమమ్ .. కుంబలంగి నైట్స్ .. రోమాంఛమ్ .. మంజుమ్మల్ బాయ్స్ ఆయన నటనకు అద్దం పడతాయి. మలయాళంలో సైలెంట్ గా .. సీరియస్ గా సాగే పాత్రలు ఎక్కువగా చేస్తూ వెళ్లిన ఆయనకి, ఇది ఒక అరుదైన అవకాశమేనని చెప్పాలి. దొరక్క దొరక్క దొరికిన అవకాశాన్ని వదులుకోకుండా చెలరేగిపోయాడు. అంతమంది గ్రూప్ డాన్సర్స్ తో కలిసి ఆయన ఈ రేంజ్ లో డాన్స్ చేస్తాడని ఎవరూ ఊహించలేదు. జోరైన స్టెప్స్ తో పూజానే కంగారు పెట్టేశాడని చెప్పుకుంటున్నారు. ఇకపై సౌబిన్ తో స్టెప్పులన్నా హీరోయిన్స్ భయపడాలేమో!  


More Telugu News