రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై సీఎం నితీశ్‌ కుమార్ వ‌రాల జ‌ల్లు.. 'ఉచిత విద్యుత్' ప్రకటన‌

  • 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ప్రకటించిన ముఖ్య‌మంత్రి
  • ఈ మేర‌కు 'ఎక్స్' వేదిక‌గా ప్ర‌త్యేక పోస్టు పెట్టిన సీఎం నితీశ్ కుమార్ 
  • ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ ప్రకటన
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్ గురువారం రాష్ట్రంలోని విద్యుత్‌ వినియోగదారులకు 125 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రకటించారు. ఈ ఏడాది చివర్లో బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నందున ఈ ప్రకటన వెలువడింది. ఈ ఏడాది అక్టోబర్ లేదా నవంబర్‌లో ఎన్నికలు జరగవచ్చ‌ని స‌మాచారం. ఈ నేప‌థ్యంలోనే సీఎం రాష్ట్ర ప్ర‌జ‌ల‌పై వ‌రాల జ‌ల్లు కురిపించారు. 

"మేము ప్రారంభం నుంచి చౌక ధరకే విద్యుత్తును అందిస్తున్నాము. 2025 ఆగస్టు 1 నుంచి, అంటే జులై బిల్లు నుండే, రాష్ట్రంలోని అన్ని గృహ వినియోగదారులు 125 యూనిట్ల వరకు విద్యుత్ కోసం ఎటువంటి డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు" అని బీహార్ ముఖ్యమంత్రి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ఎక్స్' (ట్విట్ట‌ర్‌)లో పోస్ట్ చేశారు.

ఇక‌, ఈ ప్రకటన రాష్ట్రంలోని మొత్తం 1 కోటి 67 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరుస్తుంది. అలాగే గృహ వినియోగదారుల సమ్మతితో ఇంటి పైకప్పులపై లేదా సమీపంలోని బహిరంగ ప్రదేశాలలో సౌర ఫలకాలను ఏర్పాటు చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం గురించి కూడా ఈ సంద‌ర్భంగా ఆయన తెలియజేశారు. ఈ నిర్ణయం రాబోయే మూడు సంవత్సరాలలో అమలు చేయ‌డం జ‌రుగుతుంద‌ని సీఎం నితీశ్ కుమార్‌ చెప్పారు.

కుటిర్ జ్యోతి పథకం కింద అత్యంత పేద కుటుంబాలకు సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి అయ్యే మొత్తం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది, మిగిలిన వాటికి తగిన సహాయాన్ని అందిస్తుంద‌ని ముఖ్యమంత్రి వెల్ల‌డించారు. 

టీచ‌ర్‌ ఉద్యోగాల భ‌ర్తీపై సీఎం నితీశ్ కీల‌క‌ ప్ర‌క‌ట‌న‌
ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ ఖాళీలను గుర్తించి, ఉపాధ్యాయ నియామక పరీక్ష (TRE-4)ను వీలైనంత త్వరగా నిర్వహించే ప్రక్రియను ప్రారంభించాలని నితీశ్‌ కుమార్ బుధవారం విద్యా శాఖ అధికారులను ఆదేశించారు.

"ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను గుర్తించి, TRE-4 పరీక్షను త్వరగా నిర్వహించే ప్రక్రియను ప్రారంభించాలని విద్యా శాఖకు ఆదేశాలు జారీ చేశాం. ఈ నియామకాల్లో మహిళలకు 35 శాతం రిజర్వేషన్ల ప్రయోజనం బీహార్ నివాసితులకు ఇవ్వబడుతుందని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది" అని సీఎం బుధవారం 'ఎక్స్'లో పేర్కొన్నారు.


More Telugu News